Help from Tollywood heroes :బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులుగా అతి భారీ వర్షపాతం నమోదైంది. వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబాబాద్, ఖమ్మంలో మున్నేరు వాగు పోటెత్తింది. ఏపీలో బుడమేరు వాగు ఉప్పొంగడంతో విజయవాడ, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది.
వరద కారణంగా ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లు నీటిలో మునిగిపోయి ప్రజలు మూడు రోజులుగా వరద నీటిలోనే ఉంటూ సాయం కోసం ఎదురుచూశారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అన్నీ కోల్పోయిన తమకు కట్టుబట్టలే మిగిలాయని వరద బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.
వరద బాధితులను ఆదుకోవడమే లక్ష్యం- ఆపద సమయంలో కుట్రలా? : చంద్రబాబు - CM review flood relief measures
తాజా పరిణామాల నేపథ్యంలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి తమవంతు సాయం అందిస్తున్నారు. ఎవరికి తోచినంత వారు ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా టాలీవుడ్ సైతం వరద బాధితులకు అండగా నిలిచింది. హీరో జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు హీరోలు, దర్శక, నిర్మాతలు తమ వంతుగా వరద బాధితులకు సాయం అందించారు. జూనియర్ ఎన్టీఆర్ రూ.కోటి ప్రకటించి ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం అందించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద కారణంగా జరిగిన నష్టం, ప్రజల ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేశాయని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అతి త్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.