Bank Manager Fraud In Shamshabad : ఓ సినీ నిర్మాత తెరవెనక నుంచి ఒక నేరానికి దర్శకత్వం వహించారు. బ్యాంకు ఉద్యోగులు పాత్రధారులుగా మారారు. పని చేస్తున్న సంస్థకు రూ.40 కోట్లకు కన్నం వేసినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలోని శంషాబాద్ ఇండస్ ఇండ్ బ్యాంకులో 40 కోట్ల నగదును దొడ్డిదారిలో బదిలీ చేసుకున్న కేసును సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు ఛేదించారు. తెలుగులో పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించిన బషీద్ దీనికి ప్రధాన సూత్రధారి కాగా శంషాబాద్‌లోని ఇండస్‌ఇండ్ బ్యాంకు మేనేజర్, ఉద్యోగి డబ్బు కొట్టేసినట్లు తేల్చారు. నిందితులు ముగ్గుర్నీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారంఆర్థిక మోసాల్లో ఆరితేరిన బషీద్ డబ్బు కోసం శంషాబాద్ బ్రాంచ్ మేనేజర్ కె. రామస్వామితో కలిసి పథకం వేశాడు. డబ్బు బదిలీ చేస్తే ప్రతిఫలం ఇస్తానని ఆశ చూపాడు. రామస్వామి, రాజేశ్ ఇద్దరూ కలిసి ఆదిత్య బిర్లా సంస్థ ఖాతాలోని రూ.40 కోట్లను ఉదయ్‌కుమార్‌రెడ్డి ఖాతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత బషీద్ ఆ డబ్బును మరిన్ని ఖాతాలకు బదిలీ చేశాడు. వచ్చిన డబ్బుతో నిందితుడు బషీద్ రెండు కార్లు కొన్నాడు. తన మోసానికి సహకరించిన రామస్వామికి కారును బహుమతిగా ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈకేసులో ఏ3గా బషీద్‌ను సైబరాబాద్ పోలీసులు దిల్లీలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.
ఎలా అనుమానం వచ్చిందంటే :ఆదిత్యా బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థకు ముంబయి నారీమన్‌పాయింట్ ప్రాంతంలోని ఇండస్ ఇండ్ బ్యాంకు శాఖలో ఖాతా ఉంది. సంస్థ అనుమతి లేకుండానే ఖాతా నుంచి జులై 12వ తేదీ నుంచి రూ.40 కోట్లు విత్‌డ్రా అయ్యాయి. ఈ సొమ్మును కుకునూరు ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరుతో ఉన్న ఖాతాకు రూ.25 కోట్లు, రూ.15 కోట్ల చొప్పున బదిలీ అయ్యాయి.
ఉదయ్‌కుమార్ లావాదేవీ జరగడానికి 8 రోజుల ముందే ఖాతా తెరవడం గమనార్హం. అనుమానాస్పద లావాదేవీ కావడంతో బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా హైదరాబాద్‌లోని శంషాబాద్ బ్రాంచి మేనేజర్ కనుగుల రామస్వామి, బ్యాంకు ఉద్యోగి ఎస్.రాజేశ్ నిధుల్ని పక్కదారి పట్టించినట్లు తేలింది.