Pawan Kalyan Dontation to Flood Victims :బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులుగా అతి భారీ వర్షపాతం నమోదైంది. వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తాజా పరిణామాల నేపథ్యంలో సినీతారలు ముందుకొచ్చి తమవంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే నటులు జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ తమ వంతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు విరాళం ప్రకటించారు.
పవన్ కల్యాణ్ 6 కోట్ల విరాళం : సినీ నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ.6 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.కోటి చొప్పున పవన్ విరాళం ప్రకటించారు. ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ఇవ్వనున్నారు. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించారు.
వరద ప్రాంతాల్లో తానూ పర్యటించాలని అనుకున్నానని, కానీ తన వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావిస్తున్నానని అన్నారు. తన పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదని తెలిపారు. తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని, విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని వెల్లడించారు.