Holiday for Schools in Telangana : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తీవ్ర అస్వస్థతతో దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సంతాపం తెలుపుతున్నారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్‌పై రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. మన్మోహన్ మృతితో దేశం గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయిందన్న ఆయన, రాజకీయ, ప్రజా జీవితానికి మర్యాద ఎంత అవసరమో చూపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఓ లెజెండ్ అని, దేశం కోసం నిష్కళంకమైన, సమగ్రమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. మన్మోహన్ మృతిపై శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మన్మోహన్ సింగ్ మరణంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పని చేసినప్పుడు మన్మోహన్‌తో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో ఎంతో దార్శనికతను ప్రదర్శించారని కొనియాడిన కేసీఆర్, మన్మోహన్ హయాంలోనే రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భమని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మృతిపై కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థితప్రజ్ఞత కలిగిన నేతగా పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ యువ తరానికి ఆదర్శమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.