Finable Loan App Harassment :ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీసులు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కేసు వివరాలను మీడియాకు తెలిపారు. సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ ఆరు నెలల కిందట ఫినబుల్ యాప్‌లో లోన్ తీసుకుంది.
లోన్‌యాప్ బెదిరింపులా? - ఇలా రక్షించుకోండి!
ఈ క్రమంలో సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేగాకుండా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ చేసి వేధించారు. లోన్ తాలూకూ డబ్బులు చెల్లించడం లేదంటూ దూషించారు. అంతటితో ఆగకుండా ఆమె సోదరుడికి మార్ఫింగ్ చేసిన కొన్ని న్యూడ్ ఫొటోలు కూడా పంపించడంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది.