Inferior Ingredients in Srivari Prasadam :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్టు సమాచారం. నెయ్యి కల్తీ మాత్రమే కాదని స్వామివారి ప్రసాదాల్లో జీడి పప్పు, యాలకులు, కిస్‌మిస్ వంటివన్నీ నాసిరకమే వాడేవారని, చాలా వస్తువుల కొనుగోళ్లలో గోల్‌మాల్ జరిగిందని వెల్లడైనట్టు తెలిసింది. అస్మదీయ గుత్తేదారుల నుంచి వాటిని ఎక్కువ ధరలకు కొనేవారని తేలింది.
వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక :నిబంధనల ప్రకారం ఎనిమిది మి.మీ. పరిమాణం ఉన్న యాలకులు సరఫరా చేయాల్సి ఉండగా, గుత్తేదారులు నాలుగు మి.మీ. ఉన్నవి కలిపేసి ఇచ్చినా అప్పటి టీటీడీ పాలకమండలి, కొనుగోళ్ల కమిటీ పట్టించుకోలేదని విజిలెన్స్ విభాగం గుర్తించింది. గుత్తేదారులు బస్తాల్లో కిందంతా నాసిరకం సరకు నింపేసి, పైపైన నాణ్యమైన సరకులు పెట్టి పంపేవారని సమాచారం. నాణ్యమైన సరకు నుంచే నమూనాలు తీసుకుని తిరుమలలో ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించి, అంతా బాగున్నట్టు ధ్రువీకరించేవారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ విభాగం వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
పురుగులు పట్టిన నాసిరకం జీడిపప్పు! :వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి టీటీడీకి వివిధ సరకులు సరఫరా చేస్తున్న గుత్తేదారుల్లో పాలకమండలి పెద్దలకు గిట్టనివారిని వేధించి బయటకు పంపేసినట్టు దర్యాప్తులో తేలింది. అత్యవసరం పేరుతో వారికి కావలసిన వారికి ఎక్కువ ధరలు చెల్లించి సరకులు కొన్నట్లు గుర్తించింది. సింగిల్‌బిడ్ దాఖలై, వేసినవారు బయటివాళ్లయితే టెండర్ రద్దు చేసేవారని, అదే కావలసిన వాళ్లు సింగిల్ బిడ్ దాఖలు చేసినా వారికి కాంట్రాక్ట్ కట్టబెట్టేవారని విజిలెన్స్ దర్యాప్తులో తేలిందని సమాచారం. జీడిపప్పు కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, పురుగులు పట్టిన నాసిరకం జీడిపప్పును గుత్తేదారులు సరఫరా చేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది.
బాగున్న నెయ్యి శాంపిళ్లనే పరీక్ష :తిరుమల కొండపై ఉన్నది వాటర్ సేఫ్టీల్యాబ్ మాత్రమే. అక్కడ నెయ్యి నాణ్యతను నిర్ధారించే పరీక్షలకు కావల్సిన పరికరాలు, నిపుణులైన సిబ్బంది లేరు. నెయ్యి ట్యాంకర్లలో 3 అరలు ఉంటాయి. నాణ్యతను పరీక్షించేందుకు 3 అరల నుంచి వంద గ్రాముల చొప్పున సేకరించి, ఆ మొత్తాన్ని కలిపి, దానిలోంచి నమూనాను తీసుకోవాలి. 3 అరల్లో ఒక దాంట్లోనే నాణ్యమైన నెయ్యి సరఫరా చేసి, మిగతా 2 అరల్లో కల్తీ నెయ్యితో నింపేవారా? బాగున్న నెయ్యి శాంపిళ్లనే పరీక్షకు తీసుకునేవారా అన్న కోణంలోనూ విజిలెన్స్ దర్యాప్తు సాగినట్టు తెలిసింది.