TTD Sarva Darshan Tokens Halted :తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇవ్వకుండా, నేరుగా క్యూలైన్లలోకి అనుమతి ఇస్తున్నారు. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకే వైకుంఠద్వార దర్శనం కల్పించారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన సామాన్యులకు అప్పట్లో స్వామివారి దర్శనం లభించలేదు. దీంతో వారు ప్రస్తుతం పెద్దఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. రద్దీ తగ్గేవరకు సర్వదర్శనం భక్తులను నేరుగా ఇవాళ వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోకి అనుమతిస్తున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఏరోజుకారోజు సర్వదర్శనం టోకెన్ల పంపిణీని పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
టోకెన్లు లేని సర్వదర్శనంపై చర్చ? : శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులను గతంలోలా టోకెన్లు లేకుండా అనుమతించడంపై టీటీడీ ఉన్నతాధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందడం, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. తిరుపతిలో టోకెన్లు ఇవ్వకుండా, తిరుమలలో నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతించడంపై పరిశీలించాల్సిందిగా సీఎం సూచించారు. నేరుగా సర్వదర్శనానికి అనుమతిస్తే ఎదురయ్యే ఇబ్బందులు, ప్రయోజనాలపై ఉన్నతాధికారులు చర్చించినట్లు తెలిసింది. దీనిపై టీటీడీ ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు.