Vaikunta Ekadasi 2025 in Tirumala :వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉత్తర ద్వారం దర్శనాలకు ముస్తాబైంది. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సారి సామాన్య భక్తులకు సౌకర్యంగా స్వామివారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. పోలీసు, విజిలెన్స్ విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జనవరి 10వ తేది నుంచి 19 వరకు 7 లక్షల మందికి ఉత్తర ద్వార గుండా దర్శనం కల్పించడం కోసం ఇప్పటికే ఆన్లైన్లో కొన్ని టికెట్లను అధికారులు విడుదల చేశారు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి తిరుమలలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సర్వ దర్శన టోకెన్లను జారీ చేయనుంది.
ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా : ప్రధాన ఆలయంతో పాటు తిరుమల పరిసర ప్రాంతాలను టీటీడీ సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఆధ్యాత్మిక శోభ కలిగేలా ఆలయ మాఢ వీధుల్లో రంగవల్లులు, తోరణాలు, దేవత మూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో ఏర్పాట్లు చేసే నిపుణులతో ఈ ఏడాది తిరుమలలో ప్రత్యేకంగా విద్యుత్, పుష్పాలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదయం 5 గంటల నుంచే : ఉత్తర ద్వారం గుండా ఏడు లక్షల మందికి దర్శనం కల్పించేలా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధమయ్యింది. తిరుపతిలో 8, తిరుమలలోని ఒక కేంద్రంలో ఏర్పాటుచేసిన 94 కౌంటర్ల ద్వారా ఈనెల జనవరి 10, 11, 12 తేదీలలో సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. మొదటి మూడు రోజులకు సంబంధించి లక్షా 20 వేల టోకెన్లను 9వ తేదీ తెల్లవారుజామున 5 గంటల నుంచే జారీ చేయనున్నారు.
మిగిలిన రోజులకు సంబంధించి కేటాయించిన తేదీల్లో తిరుపతిలోని విష్ణునివాసం, భూదేవీ, శ్రీనివాసం కాంప్లెక్స్‌లలో ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. బ్రేక్ దర్శనం సిఫార్సులు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలు, ఎన్ఆర్ఐ కోటాల కింద కేటాయించే దర్శనానికి భక్తులను అనుమతించమని ప్రకటించారు. దీంతో పాటు శ్రీవారి కాలిమెట్ల మార్గంలో దర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.