ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు కస్టడీకి తిరుమల కల్తీ నెయ్యి నిందితులు - TTD GHEE ROW ACCUSED CUSTODY

5 రోజుల పాటు పోలీసు కస్టడికి అనుమతిస్తూ ఉత్తర్వులు - ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో విచారణ

TTD Ghee Row
TTD Ghee Row (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 10:02 AM IST

Tirumala Adulterated Ghee Accused Police Custody: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టైన నలుగురు నిందితులను కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్‍ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‍) విచారణ నిర్వహిస్తోంది. సీబీఐ హైదరాబాద్‍ డివిజన్‍ జాయింట్‍ డైరెక్టర్‍ వీరేశ్‍ ప్రభు నేతృత్వంలో సాగుతున్న దర్యాప్తు బృందం నలుగురిని గత ఆదివారం అరెస్టు చేసింది.

ఉత్తరాఖండ్​కు చెందిన భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైయిరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా, తమిళనాడులోని ఏఆర్‍ డైయిరీ ఎండీ రాజశేఖరన్‍ అరెస్టు అయ్యారు. వీరిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్‍ న్యాయస్ధానాన్ని సిట్‍ అధికారులు కోరారు. సిట్‌ అధికారులు వేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్‍ కోర్టు నలుగురు నిందితులను 5 రోజుల కస్టడికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి న్యాయవాదుల సమక్షంలో విచారణ నిర్వహించేందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి కోటేశ్వరరావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు వీరి విచారణ జరగనుంది.

తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసు - సిట్ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు

శ్రీ వైష్ణవి ఎప్పుడెప్పుడు ఆర్డర్లు ఇచ్చింది? : మరోవైపు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో ఉన్న సిట్‌ కార్యాలయానికి గురువారం మార్కెటింగ్‌ గోడౌన్​ ఈఈ ప్రసాద్‌తోపాటు ప్రొక్యూర్‌మెంట్‌ విభాగంలోని కొందరిని పిలిచి వేర్వేరుగా విచారించారు. నెయ్యి నాణ్యతను ఎలా పరీక్షిస్తారు, పరిమాణంలో ఎప్పుడైనా వ్యత్యాసాన్ని గుర్తించారా వంటి ప్రశ్నలను అడిగారు. ఏఆర్‌ డెయిరీకి టెండర్‌ వచ్చిన సమయంలో తాను లేనని, అప్పటి వివరాలు తెలియవని ఈఈ ప్రసాద్‌ చెప్పారు. భోలేబాబా డెయిరీ ఉన్న ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రూర్కీ, ఆ సంస్థ డైరెక్టర్లుగా గతంలో ఉన్న విపిన్‌ జైన్, పొమిల్‌ జైన్‌ నివాసాలున్న దేహ్రాదూన్‌లోనూ రెండు టీమ్​లు విచారణ జరిపాయి. భోలేబాబా డెయిరీకి శ్రీ వైష్ణవి డెయిరీ నుంచి ఎప్పుడెప్పుడు ఎంత మొత్తంలో నెయ్యి కోసం ఆర్డర్లు వచ్చాయంటూ డెయిరీ సిబ్బందిని అడిగారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏఆర్‌ డెయిరీలో పనిచేసే ఓ ల్యాబ్‌ అధికారిణిని తిరుపతి సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్నట్లు సమాచారం. నెయ్యి నాణ్యత విషయంలో ఎలాంటి పరీక్షలు చేసి నిర్ధారించారు, అదే వే బిల్లుతో తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్‌ నాణ్యత లోపంతో వెనక్కి పంపిన విషయం గురించి కూడా ఆమెను ప్రశ్నించారు. మధ్యలో ఏమైనా కల్తీ జరిగిందా అనే విషయాన్ని విచారించారు. టీటీడీ మార్కెటింగ్‌ సిబ్బందిని కూడా ప్రశ్నించారు.

తిరుమల కల్తీ నెయ్యి కేసు అప్డేట్ - నలుగురి రిమాండ్

'కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ అరెస్టులపై జగన్ ఇప్పుడేమంటారు?'

ABOUT THE AUTHOR

...view details