Tiger Wandering in Warangal District : ఎటు చూసినా పచ్చదనం, ఎత్తైన గుట్టలు ఎన్నో వృక్షజాతులు మరెన్నో వన్యప్రాణులు. గోదావరి పరవళ్లు ప్రకృతి రమణీయతతో ఉమ్మడి వరంగల్ అభయారణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏటూరునాగారం, పాకాల అరణ్యం ఒకప్పుడు పెద్ద పులులకు ఆవాసం. ఇప్పుడు మరోసారి దాని అలికిడి కనిపించింది. ఆహారానికి సరిపడా వన్యప్రాణులు, తాగునీరు, సేద తీరేందుకు అనువైన అటవీ ప్రాంతం దాన్ని సాదరంగా ఆహ్వానించింది.
ఇంద్రావతి, తాడోబా టైగర్ రిజర్వుల నుంచే : ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి, మహారాష్ట్రల్లోని తాడోబా టైగర్ రిజర్వుల్లో పులుల సంఖ్య ఎక్కువైంది. అక్కడ ఆహార కొరత ఏర్పడటంతో గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాలు దాటి మనవైపు వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి అడవుల్లో శాకాహార జంతువులు అధికంగా ఉండడం కలిసివస్తోంది.
హాని తలపెడితే శిక్ష తప్పదు :వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు విధిస్తారు. పులిని ఆట పట్టించినా, భయపెట్టినా ఆరు నెలల శిక్ష పడుతుంది. వేటాడితే నాన్‌బెయిలబుల్ కేసు నమోదవుతుంది. మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పులి నివాసం ఉండే అభయారణ్యంలోని కోర్ ఏరియాల్లో వేటాడితే 3 నుంచి 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. వేటాడినట్లు ఆధారాలుంటే వారెంటు లేకుండానే అరెస్టు చేయొచ్చు. అటవీ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారు.
ఈ మార్గంలోనే గోదావరి తీరం దాటి :ఛత్తీస్‌గఢ్ కీకారణ్యం నుంచే పెద్దపులి ఓరుగల్లులోకి ప్రవేశించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చెలిమల, డోలి అభయారణ్యం మీదుగా కొత్తగుంపు, బోదాపురం అటవీ మార్గంలో గోదావరి తీర ప్రాంతంలోకి చేరుకున్నట్లు అటవీశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇక్కడి పాదముద్రల ఆనవాళ్ల ఆధారంగా ఆ మార్గమే రాకకు సులువైనదిగా నిర్ధారణకు వచ్చారు.
- బోదాపురం సమీప పెద్దలంక భూముల్లో సాగు చేస్తున్న పుచ్చపంటల గుండా దాదాపు ఐదుకు పైగా చిన్ననీటి పాయలు దాటి గోదావరి ప్రవాహం వైపు వెళ్లింది. ఆ నదిని సైతం దాటినట్లు ఆవలి ప్రాంతమైన మంగపేట మండలం చుంచుపల్లి, రాజుపేట ప్రాంతాల్లో పాదముద్రలను అటవీశాఖ గుర్తించింది.
- మల్లూరు అడవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చనేది అటవీశాఖ అభిప్రాయం.
మగ పులిగా అనుమానం :ఈ ప్రాంతంలో సంచరిస్తుంది మగ పులిగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పాదముద్రల ఆనవాళ్ల ఆధారంగా 6 ఏళ్ల వయస్సు పైబడి ఉండొచ్చని అంచనా. కొత్త ఆవాసం, తోడు, ఆహారం కోసం ప్రతి రోజూ 40 నుంచి 60 కి.మీ ప్రయాణిస్తుందని చెప్పారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి :పెద్దపులి సంచరించిన తీరం వైపు ఒంటరిగా వెళ్లొద్దు. చేతిలో కర్రలతో రక్షణగా గుంపులుగా తిరగాలి. సమీప అడవుల్లోకి మూగజీవాలను మేతకు వదలొద్దు. పంట క్షేత్రాల వద్దకు సమూహంగా వెళ్లాలి. పులి కనపడితే పరుగుపెట్టవద్దు. ఎదురుగా వచ్చినా ధైర్యంగా ఉండాలి. తల వెనుక వైపు మాస్కులు పెట్టుకోవడంతో పులి గమనింపులో మార్పు వస్తుంది. సాయంత్రం 5 గంటల లోపు నివాసాలకు చేరుకోవాలి.