SI Died Case in Yellareddy Pond : అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ముగ్గురు మృతి చెందిన కేసును కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, యువకుడు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు తేల్చిన విషయం ఇదివరకు తెలిసిందే. దాంతో మృతి చెందిన వారి ఊపిరితిత్తుల్లో నిండిన నీరు, చెరువులో నీరు ఒక్కటేనా? అనేది నిర్ధారించుకునేందుకు పోలీసులు సాంకేతికంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ల్యాబ్లో పరీక్షలు చేయించేందుకు పోలీసులు శనివారం (డిసెంబరు 28న) నమూనాలను సేకరించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులే కీలకం : ముగ్గురి మొబైల్ ఫోన్లను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపించారు. ఒకట్రెండు రోజుల్లో ఈ నివేదిక వచ్చే అవకాశం ఉందని పోలీస్ ఉన్నత వర్గాలు తెలిపాయి. మరోవైపు సమగ్ర సమాచారం సేకరించడానికి ముగ్గురి సెల్‌ఫోన్లను హైదరాబాద్‌కు చెందిన సాంకేతిక నిపుణుల వద్దకు పంపించి కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను రాబట్టనున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్, ఎలక్ట్రానిక్ పరికరాల నివేదికలు వచ్చాక కేసు దర్యాప్తు అంతిమ దశకు వచ్చే అవకాశముంది. ఒకవేళ పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టుకు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక భిన్నంగా వస్తే కేసు దర్యాప్తు తీరే మారనుంది. అందుకే అక్కడి పోలీసులు రెండు ల్యాబ్ రిపోర్టుల కోసం ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది.
వాంగ్మూలాల సేకరణ :కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు పోలీసులు పలువురి నుంచి వాంగ్మూలాల సేకరణ చేపడుతున్నారు. ఈ కేసుకు గాంధారి, మెదక్ జిల్లా కొల్చారం, బీబీపేట, భిక్కనూరు, ప్రాంతాలతో సంబంధాలు ఉండడంతో పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి మృతుల స్నేహితులు, స్థానికులు, సంబంధీకుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.