క్రిమినల్ చట్టాల్లో నూతన అధ్యయనం - ఇకపై ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదుకు అవకాశం (ETV Bharat) Three New Criminal Laws to Replace Colonial Era Codes : బాధితులు ఇకపై ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) కచ్చితంగా పోలీసులు నమోదు చేయాల్సిందేనని క్రిమినల్ నూతన చట్టాలు చెబుతున్నాయి . నేరం జరిగిన ప్రాంతం తమది కాదంటూ తప్పించుకునే ప్రయత్నాలు ఇకపై కుదరవు. నేటి నుంచి నూతన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) అమలులోకి రానున్న నేపథ్యంలో ఏడేళ్లు, ఆపైన జైలు శిక్ష పడే కేసుల్లో ఫోరెన్సిక్ సిబ్బంది సైతం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాలి . కేసుల్లో నిందితులకు శిక్ష పడాలంటే అవే కీలకంగా మారనున్నాయి.
Zero FIR : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన చట్టాలతో నేరాల బారినపడ్డ బాధితులు ఇకపై ఏ పోలీసు స్టేషన్ పరిధిలోనైనా ఫిర్యాదు చేయొచ్చు. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధి కాదంటూ ఎఫ్‌ఐఆర్ నమోదుకు పోలీసుస్టేషన్ సిబ్బంది నిరాకరించేందుకు వీల్లేదు. అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. దానిపై సత్వరమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలి. ఆ తర్వాతే ఆ నేరం ఏ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిందో అక్కడికి బదిలీ చేయాలి.
అలాగే బాధితులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండానే పోలీసు అధికారిక వెబ్‌సైట్, అధికారిక యాప్ సహా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పద్ధతుల్లోనూ ఫిర్యాదులు చేయొచ్చు. వాటిపై మూడు రోజుల్లోగా ఫిర్యాదుదారు సంతకం తీసుకుని ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలి. ఇప్పటివరకూ అమల్లో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్‌లో ఈ ప్రావిజెన్స్ లేవు. కేవలం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌లు (ZERO FIR) నమోదు చేస్తున్నారు.
కొత్త క్రిమినల్ చట్టాలు ఏ కేసులకు వర్తిస్తాయి? కేవలం కొత్త వాటికేనా?
దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాల్లో ఈ మేరకు జీరో ఎఫ్‌ఐఆర్, ఈ-ఎఫ్‌ఐఆర్ (E-FIR) కు చోటు కల్పించారు. ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశమున్న నేరాలకు సంబంధించి దర్యాప్తు అధికారులు నేర ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులను తప్పనిసరిగా తీసుకెళ్లి వారితో ఆధారాలు సేకరణ చేపట్టాలి. నేర ఘటనాస్థలం, అక్కడున్న పరిస్థితులు, ఆధారాలన్నింటినీ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలి. దీని కోసం ఇప్పటికే ఏపీలోని ప్రతి పోలీసుస్టేషన్‌కు ట్యాబ్‌లు అందజేశారు. వాటిల్లో రికార్డు చేస్తే అవి నేరుగా ఈ-సాక్ష్య యాప్‌లోకి వెళ్తాయి. భవిష్యత్తులో ఆయా నేరాల్లో నిందితులకు శిక్ష పడేలా చేయటంలో ఈ సాంకేతిక ఆధారాలు కీలకమవుతాయి.
సోమవారం అమల్లోకి కొత్త చట్టాలు- ఇకపై ఆ నేరాలకు పాల్పడితే అంతే సంగతి! - New Criminal Laws In India 2024
జులై 1 నుంచి జరిగే నేరాలపై కొత్త సెక్షన్లు :ఇండియన్ పీనల్ కోడ్((IPC) స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CrPC) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. నేటి నుంచి ఈ పేర్లతోనే ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కేసులు నమోదు చేయనుంది. అందుకు తగ్గట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్‌లోనూ(CCTNS) ఆ మేరకు మార్పులు చేసింది. ఈ కొత్త చట్టాల్లోని సెక్షన్లు, వాటి అమలులో అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులు, ఇతర అంశాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే పలు విడతల్లో శిక్షణ అందించామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఎస్హెచ్ఓ(SHO)లు, దర్యాప్తు అధికారులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా, సబ్‌డివిజన్‌ల స్థాయిలో నిపుణులతో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు.
జులై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు : కేంద్రం
రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి :మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తికావాలి. బాధితుల వాంగ్మూలాల్ని మహిళా మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి. కొత్త చట్టం ప్రకారం వారు అందుబాటులో లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచొచ్చు. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా నమోదు చేయాలి. 3 నుంచి 7 ఏళ్ల లోపు శిక్షపడే కేసుల్లో ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్ఆర్ఐ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా (14 days) దర్యాప్తు చేపట్టి కేసు కొలిక్కి తీసుకురావాలి. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నిందితుడు అరెస్టయిన తర్వాత 14 రోజల్లోపే పోలీసు కస్టడీకి కోరే అవకాశముంది. ఇప్పుడు ఈ గడువు పొడిగించారు. బాధితులు, నిందితులు ఎఫ్ఆర్ఐ ప్రతులను ఉచితంగా పొందొచ్చు. పోలీసు రిపోర్టు, ఛార్జీషీట్, వాంగ్మూలాలు, ఇతర డాక్యుమెంట్లును 2 వారాల్లోగా పొందుచ్చు. అరెస్టు సమాచారం నిందితుల స్నేహితులు, కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా తెలియజేయాలి. దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు ఇకపై వాట్సాప్ తదితర డిజిటల్ మార్గాల ద్వారా కూడా పంపించొచ్చు.
నేర నిబంధనలకు చెల్లు- చట్టాల్లో భారీ సంస్కరణలు!
వివరాలు నమోదుకు ప్రతి జిల్లాకు ఒక పోలీసు అధికారి : సెక్షన్ 37 ప్రకారం అరెస్టయినవారి పేర్లు, వారి చిరునామాలు, ఏ నేరాభియోగంపై వారు అరెస్టయ్యారనే సమాచార సేకరణ, ఆ రికార్డుల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఒక పోలీసు అధికారిని, ప్రతి పోలీసుస్టేషన్‌లో ఏఎస్సై(ASI) హోదా కంటే తక్కువ కాని అధికారిని నియమించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీసు కంట్రోల్ రూమ్‌లను నోటిఫై చేశారు. దృశ్యమాధ్యమ(Audio/video input) విధానం ద్వారా సాక్షులను విచారించేందుకు వీలుగా జిల్లా, మండల స్థాయిలో హైకోర్టు అనుమతితో నిర్దేశిత ప్రాంతాల్లో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్ గదులను నోటిఫై చేశారు. నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు అధికారులు, సిబ్బందికి బీఎన్ఎస్ఎస్ (BNSS) చట్టాల్లోని అంశాల ప్రకారం అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే వీటన్నింటికీ సంబంధించి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇవన్నీ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.