'రూ.950 కోట్లు కొట్టేసి - వాటి ప్లేస్‌లో నల్ల కాగితాలు పెట్టేసి' - వీళ్ల ప్లాన్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! (ETV Bharat) Robbery Incident in Rangareddy :రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య స్థిరాస్తి వ్యాపారం చేసేవాడు. ఇతనికి మన్సూరాబాద్‌కు చెందిన డ్రైవరు శేఖర్‌రెడ్డి, ఇసుక వ్యాపారి ఎండీ మైమూద్‌తో స్నేహముంది. వారి వారి వ్యాపారాల్లో నష్టపోయిన ముగ్గురూ అడ్డదారుల్లోనైనా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. ఈ క్రమంలోనే తుర్కయాంజల్ శ్రీరామ్‌నగర్‌లో నివాసముండే ఓ చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందని బోగిని జంగయ్యకు ఓ వ్యక్తి ద్వారా తెలిసింది.
ఈ విషయాన్ని జంగయ్య శేఖర్ రెడ్డి, మైమూద్‌తో పంచుకున్నాడు. అసలు డబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి తాంత్రికుడితో పూజలు చేయించాలనుకున్నారు. పూజారి రాకపోవడంతో మేడ్చల్‌కు చెందిన పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తికి చెప్పారు. శ్రీనివాస్ విజయవాడకు చెందిన రజాక్‌ను సంప్రదించాడు. రజాక్ తనకు తెలిసిన వ్యక్తి ద్వారా ఆరా తీయగా, చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో డబ్బున్న మాట వాస్తవమేనని తెలుసుకున్నారు. రూ.950 కోట్ల నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి పథకం వేశారు.
ఇందుకోసం రజాక్ బోయిన్‌పల్లికి చెందిన మటం సతీశ్‌ను సంప్రదించాడు. జంగయ్య, శేఖర్‌రెడ్డి, మైమూద్, పెద్ది శ్రీనివాస్, రజాక్, సతీశ్‌లు, తమకు తెలిసిన వ్యక్తులు అయిన నగరానికి చెందిన మార్కెటింగ్ ఉద్యోగి జాఖీ లఖానీ, మహ్మద్ ఆదిల్, సవూద్ హష్మి సయ్యద్ ఇస్మాయిల్, రహీముల్లా ఖాన్, అక్బర్ ఖాన్, షమీముల్లా, మహ్మద్ ముదాసిర్ను కూడగట్టారు. కొట్టేసిన సొమ్ములో వాటాలు పంచుకోవాలని అనుకున్నారు. ప్రణాళిక ప్రకారం చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో దోపిడీ చేసేందుకు నిందితుల్లో ఒకడైన సతీశ్ వద్ద నల్ల పేపర్ కట్టలు, పౌడరు, రసాయనం తీసుకున్నారు.
మేడ్చల్ జిల్లాలో భారీ చోరీ - ఫంక్షన్‌కు వెళ్లొచ్చేలోపు దోచేశారు
అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని పథకం :దోపిడీ కోసం ఇనుప కట్టర్లు, మంటలు సృష్టించే స్ప్రే, ఇనుప రాడ్‌లు, కత్తులు కొనుగోలు చేసి మే 4 అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంటికెళ్లారు. ఇంట్లోకి ప్రవేశించాక వాచ్‌మెన్ సహా యజమాని కుటుంబ సభ్యులు ఉండడం చూసి వెనుదిరిగారు. కొద్ది రోజులు అవకాశం ఎదురుచూసి ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు మళ్లీ తిరుమనతురై ఇంట్లోకి ప్రవేశించారు. జంగయ్య, మైమూద్, శేఖర్‌రెడ్డి, పెద్ది శ్రీనివాస్, సతీశ్ బయటే ఉంటూ పరిసరాలను గమనిస్తుండగా మిగిలినవారంతా ఇంట్లోకి చొరబడ్డారు.
ముందు, వెనుక భాగం నుంచి నలుగురు చొప్పున చొరబడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దీన్ని అడ్డుకోబోయిన ఇద్దరు వాచ్‌మెన్‌లను చితకబాదారు. కొందరు వెనుకభాగం నుంచి మొదటి అంతస్తులోకి ప్రవేశించారు. నిందితులు ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అలికిడి రావడంతో యజమాని తిరుమనతురై అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించాడు. కొందరు ఇంట్లోకి వస్తున్నట్లు గుర్తించి డయల్ 100కు సమాచారమిచ్చాడు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీ పుటేజీలు పరిశీలించగా నిందితుల గుట్టు బయటపడింది. నిందితుల నుంచి మూడు కార్లు, ఒక స్కూటీ, 16 ఫోన్లు, ఇనుప కట్టర్లు, ఇనుప రాడ్లు, నకిలీ కరెన్సీకి ఉపయోగించే నల్ల పేపరు కట్టలు, రసాయనాలు, రూ.80 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధునిక కాలంలోనూ తాంత్రికపూజలను నమ్మడంపై పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలను వణికిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా - చోరీల్లో తల్లిదండ్రులే పిల్లలకు గురువులు! - Dhar Gang Robbery in Hyderabad
హనుమకొండ పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ - సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు - Temple Robbery In Hanamkonda