SC Express Impatience on TG Govt :న్యాయస్థానాల విచారణలో ఉన్న క్రిమినల్ కేసుల సమాచారాన్ని ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదులు, పోలీసు అధికారుల మధ్య ఉన్న సమన్వయలోపాన్ని వెంటనే సరిదిద్దుకోవాలని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను ఆదేశించింది. సూర్యాపేట డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ వట్టె జానయ్య కేసులో దాఖలైన ఛార్జిషీట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి పూర్తి వివరాలు అందించడంలో విఫలమైన అధికారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
వీటన్నిటిపై నాలుగు వారాలలోపు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. వట్టె జానయ్యపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నమోదు అయిన కేసుల్లో ఎప్పుడెప్పుడు ఛార్జిషీట్లు దాఖలయ్యాయన్న సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పలేకపోడంతో జస్టిస్ ఎస్‌వీఎన్‌భట్టి, జస్టిస్ హృషీకేశ్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యానికి గురై, ఈ నెల 1న డీజీపీని తమ ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.
దీంతో శుక్రవారం నాడు డీజీపీ జితేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు హాజరుకాగా, ఆయనపై జడ్జీలు ప్రశ్నల వర్షం కురిపించారు. నమోదు చేసిన ‘కేసుల ఛార్జిషీట్లు దాఖలు చేసినప్పుడు వాటి తేదీలు మీ వద్ద ఉంటాయా? లేదా? కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్న తెలంగాణలో ఏ స్టేషన్‌లో ఏం జరిగినా ఒక్క క్లిక్‌తో అన్ని విషయాలూ డీజీపీకి తెలిసే పరిస్థితి ఉందని పోలీసులు చెబుతున్నారు.
మరి ఈ విషయంలో ఎక్కడ తప్పు జరిగిందన్న విషయాన్నైనా మీరు కనీసం కనిపెట్టారా? తప్పు జరిగి ఉంటే ఆ బాధ్యత ఎవరిది? మీ అధికారులదా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదిదా? ఇందుకు బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు?’ అంటూ జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి వరుస ప్రశ్నలను సంధించారు.
అందుకు డీజీపీ జితేందర్ స్పందిస్తూ, ఎక్కడ తప్పు జరిగిందో తాము తెలుసుకున్నామని, తమ వద్ద సమాచారం లేకపోవడంవల్లే ఇది జరిగిందని, భవిష్యత్తులో పునరావృతం కానివ్వబోమని న్యాయస్థానానికి తెలిపారు. ఇందులో తమ అధికారిదే తప్పని, ఆయన ప్రభుత్వ న్యాయవాదికి అవసరమైన సమాచారం ఇవ్వలేదని ఒప్పుకున్నారు. ఆ అధికారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు.