ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం - 50.5 అడుగులకు చేరిన నీటిమట్టం - flood situation in godavari

Rising flood of Godavari at Bhadrachalam : తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 50.5 అడుగులకు చేరింది. ఈ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్రమంగా నీటిమట్టం పెరగడంతో ఏపీలోని విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

FLOOD SITUATION IN GODAVARI
FLOOD SITUATION IN GODAVARI (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 7:16 AM IST

Godavari Flood at Bhadrachalam :తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఈరోజు ఉదయం 6 గంటలకు నదిలో నీటిమట్టం 50.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరినది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. 48 అడుగులు దాడిన తరువాత అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. గత రెండు రోజుల నుంచి వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్దకు చేరి నిలకడగా ప్రవహిస్తోంది. నీటిమట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.

గోదావరిలోకి నో ఎంట్రీ : గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద వరద ఉధృతి పెరిగింది. కళ్యాణ కట్ట వద్దకు వరద నీరు చేరడంతో భక్తులను నది వద్దకి అనుమతించడం లేదు. భద్రాచలం దిగువన ఉన్న రహదారుల పైకి వరద నీరు చేరడంతో విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ప్రమాదకరంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలోకి చేపలు పట్టేందుకు ఎవరిని అనుమతించడం లేదు. ముంపునకు అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైతే వారిని తరలించేందుకు ఏర్పాట్లపై దృష్టి సారించారు. 2022లో గోదావరికి భారీగా వరదలు వచ్చినప్పుడు కరకట్ట దెబ్బతింది. ఇప్పుడా పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అత్యధిక వరద ఎప్పుడు వచ్చిందంటే : ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1986లో భద్రాద్రి వద్ద అత్యధిక వరద నమోదైంది. నదిలో నీటిమట్టం 75.60 అడుగులకు చేరింది. ఆ సమయంలో 27 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. 2022 వరదల్లో ప్రవాహం 71.30 అడుగులుగా నమోదైంది. 21.78 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ స్థాయిలో ప్రమాదం లేకపోయినా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details