Quotation Caught The Thieves :అడగ్గానే అప్పు చేసి మరీ కేటీఎం బైక్‌ను కొనిచ్చాడు ఆ తండ్రి. విలాసాలకు అలవాటుపడిన ఆ యువకుడు దానిపై తిరుగుతూ సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. తన బైక్ నంబర్ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తలు పడ్డాడు. కానీ బైక్ వెనక అతడు ఎంతో ఇష్టపడి రాసుకున్న ‘కొటేషన్’ అతన్ని పోలీసులకు పట్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్డునంబర్-25కు చెందిన రామకృష్ణ ఈ నెల 24న ఆసుపత్రికి వెళ్లిన తన భార్య కోసం జూబ్లీహిల్స్‌లో ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అతని చేతిలోని సెల్‌ఫోన్ లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు.నిందితులు కేటీఎం బైక్‌పై వచ్చినట్లు గుర్తించారు. అయితే బైక్ నంబర్ చూసి దొంగను కనిపెడదామనుకున్న పోలీసులకు షాక్ తగిలింది. నంబర్ ప్లేట్ కనబడకుండా దొంగలు జాగ్రత్తపడ్డారు.
అయితే నంబర్ ప్లేట్ కనిపించకుండా జాగ్రత్త పడినా పోలీసులు కేటీఎం షోరూం ద్వారా ఎలాగోలా వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే అనుమానిత వాహనాల జాబితా సిద్ధం చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆగంతుకులు తమ వాహనంపై రాసుకున్న ‘'రెడీ టు రేస్'’ పేరుతో ఉన్న కొటేషన్‌ను పోలీసులు గుర్తించారు. ఆ కొటేషన్ సాయంతో చోరీ చేసింది బేగంపేటలో నివసిస్తూ ఇంటర్ చదువే కిరణ్ కుమార్(19)తోపాటు మరో మైనరు అని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారిని విచారించగా చోరీ చేసినట్లు వారు పోలీసుల ఎదుట అంగీకరించారు.