Loss making electricity circles: కరెంటు సరఫరా, పంపిణీ, వాణిజ్య (ATC) నష్టాల నివారణకు కొన్ని విద్యుత్ సర్కిళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా, హైదరాబాద్ దక్షిణ (సౌత్) విద్యుత్ సర్కిల్ పరిధిలోని పాతబస్తీ ప్రాంతాన్ని, అదానీ సంస్థకు అప్పగించబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే తెలిపారు. అందుకు సంబంధించి ఉన్నతస్థాయిలో సమావేశాలు జరిగాయి. అదానీ సంస్థ సైతం ఇప్పటికే డిస్కంల నుంచి సమాచారం తీసుకుంది.
కరెంటు పంపిణీ, బిల్లుల వసూలను బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించాలంటే మెుదట రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అనుమతి ఇవ్వాలి. తర్వాత డిస్కంలు టెండర్లు పిలిచి ప్రైవేటు కంపెనీలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇవ్వకపోయినప్పటికీ, ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి. అదానీ సంస్థ బృందాలు కొంతకాలంగా పాతబస్తీపై అధ్యయనం చేస్తున్నాయి. పాతబస్తీని అప్పగిస్తున్నందున, భవిష్యత్తులో నష్టాలొచ్చే ఇతర విద్యుత్ సర్కిళ్లకూ అదే విధానం వర్తిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘సౌత్’ సర్కిల్‌లో ఎక్కువగా:హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో అత్యధికంగా సుమారు 41.4 శాతం నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. దీని పరిధిలోని బార్కాస్ ఫీడర్‌లో ఏకంగా 90.7 శాతం నష్టాలు నమోదయ్యాయి. ఈ సర్కిల్‌లో పరిధిలో రోజూ రూ.మూడు కోట్ల విలువైన కరెంటు సరఫరా చేస్తున్నారు. కానీ ఆదాయం మాత్రం రూ. కోటిన్నర ఆదాయమే తిరిగి వస్తోంది. మిగతా కోటిన్నరను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ (డిస్కం) నష్టాలుగా చూపెడుతుంది. ఈ ఒక్క సర్కిల్ నుంచే ఏటా రూ.500 కోట్లకు పైగా డిస్కం నష్టపోతోంది. రాష్ట్రంలోని రెండు డిస్కంల వార్షిక నష్టాలు రూ.5,500 కోట్లకు పైగా ఉన్నాయి. వాస్తవంగా సరఫరాలో సాంకేతిక సమస్యల వల్ల నష్టం సగటున 10-12 శాతం కాగా, విద్యుత్ చౌర్యం, బిల్లుల ఎగవేత వంటివే నష్టాలకు ఎక్కువ కారణమవుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుతో ఎలాంటి ఉపయోగం లేదు - కమిషన్‌తో నిపుణులు వెల్లడి - Justice Narasimha Reddy Commission