Telangana Govt Focus ON LRS :రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి సర్కారు చర్యలు చేపట్టింది. మూడు నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి మార్గదర్శకాలను జారీచేశారు. ప్లాట్ల అప్లికేషన్లను మూడు దశల్లో, లే అవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ణీత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు.
25 లక్షల దరఖాస్తులు : స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకోసం 2020 నుంచి సుమారు 25లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కోర్టుల్లో కేసుల కారణంగా అవి పరిష్కారానికి నోచుకోలేదు. ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారికి మాత్రం 'న్యాయస్థానం తీర్పునకు లోబడతామంటూ' అఫిడవిట్ తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారు. డిసెంబరులో అధికారం చేపట్టిన నాటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జనభర్జన పడిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. దీంతో దరఖాస్తుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
దరఖాస్తులను సీజీజీ పరిశీలించాకే :ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందస్తు పరిశీలిస్తుంది. నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ద్వారా వడపోత జరుగుతుంది. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి వాటిపై దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది. దరఖాస్తుదారులు పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకపోయినా దానిపైనా సమాచారాన్ని పంపుతుంది. అనంతరం మిగిలిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారు లబృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది.