Tulasi Narayana Excelling in Paintings : వైకల్యం శరీరానికే కానీ ప్రతిభకు కాదని నిరూపిస్తున్నాడు ఈ కుర్రాడు. విధి విసిరిన సవాల్ తట్టుకుని నిలబడుతూ తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. భారం అవుతాడేమోనని వెక్కిరించిన వాళ్లే ఔరా అనేలా చేస్తున్నాడు. డ్రాయింగ్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్ వంటి రంగాల నైపుణ్యాలు సాధించి తల్లిదండ్రుల నమ్మకం నిలబెట్టాడు ఈ ఔత్సాహికుడు.
Tenali Young Man Multiple Skills : చిత్రాలు గీస్తున్న ఈ కుర్రాడి పేరు వేల్పూరి తులసి నారాయణ. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. తండ్రి శివశంకర్ స్టిక్కరింగ్ కార్మికుడు, తల్లి మోహనలక్ష్మి గృహిణి. పుట్టుకతోనే వైకల్యం బారిన పడిన తులసి నారాయణకు కుడిచేతితో పాటు కాళ్లు సరిగ్గా పని చేయవు. తానంతట తాను స్వయంగా నడవలేని స్థితి. అయితే ఇతడిలోని ప్రతిభ గుర్తించిన తల్లిదండ్రులు కళాకారుడిగా ఎదిగేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం అందించారు.
కన్నవారి ప్రోత్సాహంతో ఆసక్తి ఉన్న చిత్రకళపై సాధన చేయడం ప్రారంభించాడు తులసి నారాయణ. అతి తక్కువ సమయంలోనే చిత్రకారుడిగా ప్రతిభ చాటుకున్నాడు. జీవం ఉట్టిపడే మనుషుల బొమ్మలు వేయడంలో ప్రత్యేకత చూపుతున్నాడు. అంతర్జాలాన్ని ఆసరాగా చేసుకుని చిత్రకళలో మంచి పట్టు సాధించాడు. యూట్యూబ్ తరగతులు, ఆన్‌లైన్ వీడియోలను చూస్తూ తనలోని సృజనకు పదును పెట్టుకున్నాడు.
"నేను 12 సంవత్సరాల నుంచే బొమ్మలు గీయడం నేర్చుకున్నాను. మా స్నేహితులు, తల్లిదండ్రుల సహాయంతో చిత్రకళలో నైపుణ్యం సాధించాను. యూట్యూబ్ ద్వారా బొమ్మలు గీయడంలో నైపుణ్యం సాధించాను. ఆన్‌లైన్ వీడియోలను చూస్తూ నాలోని సృజనను పెంచుకున్నాను." - వేల్పూరి తులసి నారాయణ, కళాకారుడు
విభిన్నరకాల పోట్రెయిట్స్ చిత్రాలు వేయడంలో నైపుణ్యం సాధించాడు తులసి. పెన్సిల్, చార్కోల్, కలర్ పెన్నులు, ఆయిల్, వాటర్ వినియోగించి అందరూ మెచ్చే పోట్రెయిట్ చిత్రాలకు రూపం ఇస్తున్నాడు. చిత్రకారుడిగా రాణిస్తూనే ఖాళీగా ఉన్న సమయంలో ఆన్‌లైన్ కోర్సుల మీద దృష్టి సారించాడు. గ్రాఫిక్స్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఈ-బుక్ రైటింగ్ అంశాలను నేర్చుకున్నాడు.
చదువులోనూ రాణిస్తున్న తులసి నారాయణ :నిరంతర సాధనతో ఎక్కడ శిక్షణ తీసుకోకుండానే మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాడు తులసి నారాయణ. కళాశాల ప్రిన్సిపల్ రాంచంద్రరావు ప్రోత్సాహంతో ఆన్‌లైన్ మార్కెటింగ్ సేవలు మొదలు పెట్టాడు. కళాశాలకు చెందిన వివిధ కార్యక్రమాల ప్రచార చిత్రాలను స్వయంగా రూపొందించాడు. పలు యూట్యూబ్ ఛానెళ్లకు, సంస్థలకు గ్రాఫిక్స్ డిజైనింగ్ అందించాడు. మరోవైపు చదువులోనూ తులసి నారాయణ అద్భుత ప్రతిభ చూపుతున్నాడు.
బంధువులు, స్నేహితుల నుంచి అవమానాలు ఎదురైనా ప్రతిభను గుర్తించి అండగా నిలిచారు తల్లిదండ్రులు. పాఠశాల, కళాశాలకు తీసుకెళ్లి తీసుకువచ్చారు. లోపాన్ని మరిపించేందుకు ఇతరత్ర అంశాలపై దృష్టి సారించారు. ప్రయత్నం, నమ్మకాలకు సాక్ష్యంగా కుమారుడు ఎదుగుతుంటే చూసి వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధించాలనే తపన, ఎందుకు చేయలేను అనే మనస్తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించ వచ్చనని నిరూపిస్తున్నాడు తులసి నారాయణ. తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల నమ్మకాన్ని నిజం చేస్తూ ఎంచుకున్న ప్రతిరంగంలో రాణిస్తున్నాడు. ఇటీవలే పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి తనలాంటి మరెందరికో సాయపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.
పవర్‌లిఫ్టింగ్‌లో నంద్యాల యువతి సత్తా - ప్రోత్సాహం కోసం ఎదురుచూపు - Anju excelling in Power Lifting
Para Badminton: విధిరాతను ఎదిరించి.. పారా బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతున్న శ్రీకాకుళం యువతి