Ten Days NCC Camp At NTR Veterinary College : సాధారణంగా మనం గుర్రాల దగ్గరకు వెళ్లాలంటేనే భయపడతాం. అలాంటి వాటితో NCC విద్యార్థులు అనేక విన్యాసాలు చేయించారు. ఇదొక్కటే కాదండోయ్. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన విద్యలు సైతం ఈ క్యాంపులో ప్రదర్శించారు. కుక్కలు సైతం దేశ సేవలో ఎలా భాగస్వామ్యం అవుతాయో విద్యార్థులకు కళ్లకుకట్టినట్లు చూపించారు. దీంతో పాటు విపత్కర పరిస్థితులు సంభవించే సమయంలో ఎలా వ్యవహరించాలో ఈ క్యాంపులో విద్యార్థులకు నేర్పారు. ఇంతకీ ఏంటా క్యాంప్ ఎక్కడ ఆ విన్యాసాలు జరిగాయో ఈ కథనంలో తెలుసుకుందామా.
దేశం కోసం మూగజీవులు : కృష్ణాజిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ లో నిర్వహించిన పది రోజుల NCC క్యాంపులో విద్యార్థులు అనేక విన్యాసాలు చేశారు. దేశం కోసం పోరాటే క్రమంలో సైనికులు మూగజీవులను సైతం ఎలా భాగస్వామ్యం చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపించారు. పది రోజుల ఎన్.సీ.సీ క్యాంపులో వందలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ విద్యార్థులతో పాటు విజయవాడ నగరానిక చెందిన పి.బీ సిద్ధార్థ, ఆంధ్రా లయోలా కాలేజ్, దనేకుల కాలేజ్ ల విద్యార్థులు ఈ క్యాంపులో భాగస్వామ్యం అయ్యారు. దేశ భక్తిని పెంపొందించే విధంగా ఈ పదిరోజుల ఎన్.సీ.సీ క్యాంపు జరిగింది.
ఉప్పొంగిన ఆనందం - ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో జెండా పాతిన విద్యార్థులు
గుర్రాలతో విన్యాసాలు : వెటర్నరీ కాలేజ్ లో ఈ కార్యక్రమం జరగడంతో మూగజీవాలను దేశం కోసం పోరాటం చేయడానికి ఎలా సిద్ధం చేస్తారో విద్యార్థులు తెలిపారు. అంతే కాదు ఈ క్యాంపులో భాగంలో నిర్వహించిన హార్స్ రైడ్ లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గుర్రాలను తమ ఆధీనంలోకి తీసుకొని, వారు చెప్పే విధంగా గుర్రలు విన్యాసాలు చేస్తూండటం చూపర్లను ఆకట్టుకుంది. దీంతో పాటు ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను శిక్షణ ఇచ్చిన కుక్కలు ఎలా పట్టుకుంటాయో కళ్లకు కట్టినట్లు చూపించారు.
విద్యార్థులకు బహుమతులు : ఈనెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా అతిథులు ఉపన్యాసాలు ఇచ్చారు. దేశసేవలో ఎన్.సి.సి విద్యార్థులు ఎలా భాగస్వామ్యం అవ్వాలో అతిథిలు తెలిపారు. దేశంకోసం పోరాటం చేసే క్రమంలో మూగజీవాలు ఎలా ఉపయోగపడతాయో విద్యార్థులు స్పష్టంగా చూపించారు. గుర్రపు స్వారీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు సైతం అందించారు.
దిల్లీలో సత్తా చాటేలా : ఈ కార్యక్రమానికి ఆర్మీ అధికారులు సైతం పాల్గొని దేశసేవ కోసం విద్యార్థులు ఎలా సన్నద్ధం అవ్వాలో సూచించారు. దీంతో పాటు ఈ క్యాంపులో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి దేశ రాజధాని దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చేందుకు అధికారులు ఎంపిక చేస్తారు. ఇక్కడే కాదు మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ లో జరిగే ఇలాంటి క్యాంపులోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలి. అప్పుడే ఎన్.సీ.సీ విద్యార్థులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం లభిస్తుంది. అందుకోసం మరింత శ్రమించి సత్తా చాటుతామని NCC విద్యార్థులు చెబుతున్నారు.
ప్రత్యక్ష అనుభూతి : గుర్రపు స్వారీలో పాల్గొన్న విద్యార్థుల్లో కొందరు గతంలోనూ జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి పలువురి ప్రశంసలు పొందారు. ఈ పది రోజుల ఎన్.సీ.సీ క్యాంపులో సుమారు 280 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ లో జరిగిన ఈ విన్యాసాలు చూడడానికి విద్యార్థులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే అనేక మంది వచ్చారు. వారంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తాము టీవీలో తప్పిస్తే ప్రత్యక్షంగా ఇలాంటి కార్యక్రమాలు చూడలేదని అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుర్రపు విన్యాసాలు చూడడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
సమ్మర్ క్యాంపుల్లో ఉత్సాహంగా విద్యార్థులు- ఈత కొడుతూ కేరింతలు - SUMMER CAMP
కర్ణాటకలో నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ - తెలుగువారి గొప్పతనాన్ని చాటిన విద్యార్థులు - national integration Camp 2024