Eenadu Group Chairman Ramoji Rao Passed Away : అక్షరయోధుడు రామోజీరావు అస్తమయంపై, తెలుగు రాష్ట్రాల ప్రజలు విచారం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ఆయన చేసిన అపార సేవలను గుర్తుచేసుకున్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన క్యాంప్ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి, పూలమాల వేసి నివాళులర్పించారు. జర్నలిజంలో రామోజీరావు, ఉన్నత విలువలు నెలకొల్పారని కొనియాడారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ అమరవీరుల స్థూపం వద్ద అక్షర యోధుడు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టు సంఘాల నాయకులు నివాళులర్పించారు. యాదగిరిగుట్టలో రామోజీరావు చిత్రపటానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాళులర్పించారు. తెలుగు పాత్రికేయ రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు. మోత్కూరు మండల కేంద్రంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు : ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు అక్షరయోధుడికి నివాళి అర్పించారు. నిర్మల్ జిల్లా భైంసాలో పాత్రికేయులు మహానీయుడి తెలుగు జర్నలిజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. రామోజీరావు మరణం పత్రిక రంగానికి తీరని లోటని ఆదిలాబాద్ జర్నలిస్టు ఐక్య కార్యాచరణ సమితి నాయకులు పేర్కొన్నారు. స్టానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సంతాప సభలో రామోజీరావు తెలుగురాష్ట్రాలకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని తెలుగుదేశం కార్యాలయంలో కార్యకర్తలు నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా మల్యాలలో పలువురు ప్రజా ప్రతినిధులు, యువకులు రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. కమాన్‌పూర్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు, బీసీ సంఘం నాయకులు రామోజీరావు మృతి పట్ల నివాళులర్పించి సంతాపం తెలిపారు.