Telangana Electricity Purchase in Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ కరెంటు వ్యయంపై తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) జాతీయ విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో దాఖలు చేసిన అప్పీలుపై తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ విషయంపై 2018లోనే కేసు దాఖలు చేసినా ఇంతవరకూ విచారణే పూర్తి కాకపోవడం గమనార్హం. 2014లో తెలంగాణ ప్రభుత్వంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మార్వా వద్ద వెయ్యి మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మించిన ప్లాంటు నుంచి కరెంటు సరఫరా చేస్తామని ఒప్పందంలో తెలిపింది. అయితే ఈ ప్లాంటు నిర్మాణంలో 45 నెలల తీవ్ర జాప్యం జరగడంతో నిర్మాణ వ్యయం 40 శాతం పెరిగి తెలంగాణ డిస్కంలపై ఆర్థిక భారం భారీగా పడింది.
ఈ మార్వా ప్లాంటు నిర్మాణం 2012 కల్లా పూర్తి కావాలి. నిర్మాణ ప్రణాళిక ప్రకారం రూ.6,317.70 కోట్లు వ్యయంగా నిర్ణయించారు. కానీ ఆలస్యం కావడంతో వ్యయం పెరిగి ఆ మొత్తం రూ.8,999.43 కోట్లకు పూర్తి చేసినట్లు ఛత్తీస్‌గఢ్ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలో 2018లో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై తెలంగాణ డిస్కంలు విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో అప్పీలు చేశాయి. వాస్తవాలు పరిశీలించకుండా సీఎస్ఈఆర్సీ తమపై అన్యాయంగా రూ.2,574 కోట్ల మేర అదనపు భారం మోపిందని తెలిపాయి. మార్వా ప్లాంటు నిర్మాణ ప్రణాళిక ప్రకారం మెగావాట్‌కు సగటున రూ.5.89 కోట్లు అవుతుందనుకుంటే సుధీర్ఘ జాప్యంతో రూ. 8.89 కోట్లను దాటేసింది. 2014లో మార్వా ప్లాంటు నుంచి కరెంటు కొనడానికి తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకునే సమయానికే దాని నిర్మాణంలో 21 నెలల జాప్యం ఉంది. అయినా 2016 దాకా తెలంగాణకు కరెంటు రాలేదు.
తుది వ్యయం ఆధారంగా :
- ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ 2018లో బహుళ వార్షిక టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం స్థిరఛార్జీల కింద 2018 నుంచి 2021 వరకు ప్రతి ఏడాది ఒక్కో రేటును పెంచుకుంటూ పోయాయి. అందుకు అదనంగా ఒక్కో యూనిట్‌కు రూ.1.39 చొప్పున ఇందన ఛార్జీని తెలంగాణ డిస్కంల నుంచి వసూలు చేయాలని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ తీర్పు ఇచ్చింది. అయితే తెలంగాణ డిస్కంలు కూడా వ్యయం మరింత భారంగా మారిందని పిటిషన్ వేసింది.
- విద్యుత్ ప్లాంటు నిర్మాణం కోసం జెన్కోలు రుణాలు తీసుకోవడం ఆనవాయితీ అయితే దీని నిర్మాణం పూర్తయ్యేవరకు దీనిపై వడ్డీ భారం పడుతుంది. దీన్ని ఇంట్రస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అని పిలుస్తారు. మార్వా ప్లాంటు వ్యయం 40 శాతం పెరగడానికి ఐడీసీ భారీగా రూ.2,994.54 కోట్లు పడటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పడిన 95 శాతం వడ్డీని కూడా తెలంగాణ డిస్కంలే కట్టాలని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ తీర్పు చెప్పింది. కానీ అదే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా వద్ద నిర్మించిన మరో ప్లాంటు నిర్మాణంలో జరిగిన జాప్యంతో అదనపు వడ్డీలో 50 శాతం కట్టాలని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ చెప్పడం గమనార్హం.
- మార్వా ప్లాంటు నుంచి కరెంటు కొనడానికి ఛత్తీస్‌గఢ్ డిస్కంలే ముందుగా పీపీఏ చేసుకోవడంతో తెలంగాణ డిస్కంలు ప్లాంటు నుంచి కాకుండా ఛత్తీస్‌గఢ్ డిస్కంల నుంచే పీపీఏ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పడు ఆ డిస్కంలు యూనిట్‌కు అదనంగా 7 పైసలు కమీషన్ వసూలు చేయడంతో తెలంగాణ డిస్కంలపై మరింత భారం పడినట్లు అయింది.
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుతో ఎలాంటి ఉపయోగం లేదు - కమిషన్‌తో నిపుణులు వెల్లడి - Justice Narasimha Reddy Commission
గత ప్రభుత్వ తొందరపాటు వల్ల ట్రాన్స్‌కో, జెన్కోకు రూ.81 వేల కోట్ల అప్పు : కోదండరాం - Telangana electricity purchases