Telangana Tax Revenue Increased : గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తెలంగాణకు పన్నులరూపంలో వచ్చే ఆదాయం పెరిగింది. 2023-24లో జూన్ నెలాఖరు వరకు పన్నుల రూపంలో రూ.31,725 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవతర్సరంలో జూన్ నెలాఖరు వరకు రూ.34,609 కోట్లు సమకూరాయి. అంటే రాబడిలో దాదాపు 3వేల కోట్లు పెరుగుదల నమోదైంది.
రాష్ట్రానికి పెరిగిన పన్ను ఆదాయం :ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు తెలంగాణ ప్రభుత్వం వివరాలు అందించింది. ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే జూన్ నెలలో పన్ను ఆదాయం పెరిగింది. పన్నుల ద్వారా ఏప్రిల్ లో ఖజానాకు రూ.11,464 కోట్లు, మే నెలలో రూ.10,954కోట్లు జూన్ నెలలో రూ.12,190 కోట్లు సమకూరాయి. మొదటి 3నెలల్లో జీఎస్టీ ద్వారా రూ.12,536 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.3,449 కోట్లు వచ్చాయి.
ఏయే పన్నుల నుంచి ఎంతవాటా అంటే? :అమ్మకంపన్ను ద్వారా రూ.8,202 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.4,785 కోట్లు ఖజానాకు చేరాయి. తెలంగాణ వాటాగా కేంద్ర పన్నుల నుంచి రూ.3,635 కోట్లు, ఇతర పన్నుల ద్వారా మరో రూ.1,998 కోట్లు సమకూరాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పన్నేతర ఆదాయం వెయ్యి కోట్లు వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 3నెలల్లో గ్రాంట్ల రూపంలో కేంద్రప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా రాలేదు.
రెవెన్యూ రాబడి :గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్రానికి రూ.1811కోట్లు గ్రాంట్ల ద్వారా వచ్చాయి. పన్నేతర ఆదాయం కూడా నిరుడు కాస్త ఎక్కువగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 3నెలల్లో పన్ను ఆదాయం 3వేలకోట్ల వరకు పెరిగనప్పటికీ గ్రాంట్లు రాకపోవడం, పన్నేతర ఆదాయం స్వల్పంగా తగ్గడంతో రెవెన్యూ రాబడి ఆశించిన మేర పెరగలేదు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఖజానాకు చేరిన మొత్తం రూ.35,669 కోట్లు. నిరుడు జూన్ వరకు వచ్చిన ఆదాయం రూ.35,024 కోట్లు. అంటే గతేడాదితో పోలిస్తే పెరుగుదల 600కోట్లు మాత్రమే.
ప్రభుత్వ రుణాలు :ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి ప్రభుత్వం 13,180 కోట్ల రుణాలు తీసుకొంది. దీంతో ఖజానాకు మొత్తం 48,790 కోట్లు చేరగా జూన్ నెలాఖరు వరకు 45,320 కోట్లు ఖర్చు చేసింది. వేతనాల కోసం 11,026 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం, 5,933 కోట్లు వడ్డీగా చెల్లింపులు చేసింది. పింఛన్లపై 4,311 కోట్లు, రాయితీలపై 3,354 కోట్లు వ్యయమైంది. నికరంగా చూస్తే జూన్ నెలాఖరు వరకు 3,652 కోట్ల రెవెన్యూ లోటు 13,171 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రాథమిక లోటును 7,237 కోట్లుగా పేర్కొంది.
రాష్ట్ర సొంతపన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి - గతేడాదితో పోలిస్తే రూ.1700 కోట్లు అదనం - Tax Revenue to State Exchequer
రాష్ట్ర ఖజానాకు తగ్గిన పన్నుల రాబడి - నెలలో రూ.1000 కోట్లు కోల్పోయిన సర్కార్