Telangana SDRF Services :రాష్ట్రంలో సరికొత్త దళం అనేక ఆధునిక హంగులతో అందుబాటులోకి రానుంది. జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) రంగంలోకి దిగనుంది. భారీ అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరం సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం సిద్ధమవుతోంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది సిబ్బందితో ఇది ఏర్పాటవుతోంది. అగ్నిమాపక శాఖలోని ఫైర్‌స్టేషన్లు ఇక నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 137 ఫైర్‌స్టేషన్‌లలోని దాదాపు 1000 మంది సిబ్బందితో పాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన పది కంపెనీలతో కూడిన వెయ్యి మంది సిబ్బంది ఈ దళంలో విధులు నిర్వర్తించనున్నారు.
రూ.35.3 కోట్ల మంజూరు :రాష్ట్రంలో గత జూలై, ఆగస్టు నెలల్లో సంభవించిన భారీ వరదల్లో పలు ప్రాంతాలు నీట మునిగిన క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో సుశిక్షితులైన సిబ్బందితో కూడిన దళం అవసరమని భావించి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను తీర్చిదిద్దడంతో పాటు ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.35.3 కోట్లను గత అక్టోబరులో మంజూరు చేసింది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు సిబ్బందికి శిక్షణ ఇప్పించారు.
దేశ నలుమూల శిక్షణ : ఇందులో భాగంగానే 1000 మంది అగ్నిమాపక సిబ్బందికి ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు. రెండు వందల మంది చొప్పున సిబ్బందికి ఐదు బ్యాచుల్లో ఎనిమిది వారాల పాటు తమిళనాడులోని అరక్కోణం, మహారాష్ట్రలోని పుణె, గుజరాత్లోని వడోదర, ఒడిశాలోని ముందాళి, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ వంటి తదితర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకున్నారు. టీజీఎస్పీ సిబ్బంది త్వరలోనే శిక్షణ తీసుకోనున్నారు.