తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణికులపై 'ప్రత్యేక' భారం - పండుగ వేళ టికెట్ల రేట్లు పెంచేసిన టీజీఎస్​ఆర్టీసీ - RTC BUS FARE INCREASE IN TELANGANA

బస్సు ఛార్జీలను పెంచిన ఆర్టీసీ - ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం వసూలు

RTC Bus Fare Increase in Telangana
RTC Bus Fare Increase in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2024, 7:58 AM IST

RTC Bus Fare Increase in Telangana : తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండుగ అంటే బతుకమ్మ, దసరా అని ఇట్టే చెప్పేస్తారు. నగరాలు, పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు ఈ పండక్కి సొంతూళ్ల బాట పడతారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రజా రవాణా సంస్థ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తోంది. గత ఏడాది, అంతకు ముందు సంవత్సరాల్లో దసరా పండక్కి సొంతూళ్లకు సాధారణ ఛార్జీలతోనే వెళ్లి వచ్చిన ప్రజల నుంచి ఆర్టీసీ ఈసారి అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం తర్వాత సంస్థ లాభాల్లోకి వచ్చింది. ఇలాంటి సమయంలో ఆర్టీసీ మెరుగైన సేవలు అందిస్తుంది అనుకున్నారు అంతా. కానీ వారికి ఆ సంస్థ షాక్​ ఇచ్చింది.

దసరాకు నడుపుతున్న ప్రత్యేక సర్వీసుల టికెట్‌ బేసిక్‌ ధరలో ఆర్టీసీ 50 శాతం పెంచింది. దీంతో ఛార్జీలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌-ఆదిలాబాద్‌ సూపర్‌ లగ్జరీ రెగ్యులర్‌ బస్‌లో ఛార్జీ రూ.630 ఉండగా, స్పెషల్​ బస్సుల్లో రూ.880 అవుతోంది. హైదరాబాద్‌ నగరంలో నడిపే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులనూ ఆర్టీసీ స్పెషల్​ బస్సుల పేరుతో దూర ప్రాంతాలకు నడుపుతోంది. ఈ బస్సులు సిటీల్లో పరిమిత దూరం వరకు సౌకర్యంగా ఉంటాయి, కానీ వందల మీటర్ల దూర ప్రాంతాలకు నడుపుతున్న కారణంగా 50 శాతం అదనపు బాదుడుతో ఆర్టీసీ నడుపుతోంది.

ప్రత్యేక బస్సుల పేరిట వసూళ్లు :హైదరాబాద్‌ నుంచి వివిధ రూట్లలో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ లగ్జరీ బస్నుల్ని రెగ్యులర్‌తో పాటు స్పెషల్​ బస్సులనూ ఆర్టీసీ నడిపిస్తోంది. డీలక్స్‌ బస్సుల విషయానికి వస్తే పలు రూట్లలో ప్రతి బస్సునూ అధిక ఛార్జీలతో ప్రత్యేక బస్సుగానే నడిపిస్తోంది. సాధారణ ఛార్జీలతో రెగ్యులర్‌ బస్సుల్లేకుండా చేసింది. డీలక్స్​ కంటే సూపర్​ లగ్జరీ ఛార్జీలు ఎక్కువ. ప్రతి డీలక్స్‌ బస్సునూ ప్రత్యేకం చేయడంతో సూపర్‌ లగ్జరీ టికెట్ ధరలు డీలక్స్‌ను మించిపోయాయి. హైదరాబాద్‌-ఖమ్మం మధ్య 10వ తేదీన 13 డీలక్స్‌ బస్సులుంటే అన్నీ ప్రత్యేక బస్సులుగా చేసి నడిపిస్తున్నారు. ఈ మార్గంలో సూపర్‌ లగ్జరీ టికెట్‌ ధర రూ.430 అయితే డీలక్స్‌ ప్రత్యేక బస్సులో ఛార్జీ రూ.440కు పెంచారు. 10వ తేదీన హైదరాబాద్‌ నుంచి 1,041, 11న 1,341 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచించింది.

ABOUT THE AUTHOR

...view details