Telangana Second Rank in Cell Phones Recovery :నిత్యజీవితంలో సెల్‌ఫోన్ ఒక భాగంగా మారింది. పట్టుమని పది నిమిషాలు కూడా మొబైల్ లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇందులో మనకు సంబంధించిన ఎన్నో విషయాలను, సమాచారాన్ని భద్రపరుచుకుంటాం. ఒకవేళ మన మొబైల్‌ను ఎవరైనా దొంగిలించినా, లేదా మనమే పొరపాటున పోగొట్టుకున్నా కంగారు పడిపోతాం. వెంటనే సెల్‌ఫోన్ వెతికేందుకు ప్రయత్నిస్తాం. ఇక దొరకకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అలాంటి వారికి తెలంగాణ పోలీసులు అండగా నిలుస్తున్నారు. చరవాణిలను రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు.
సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు సత్తాచాటినట్లు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీఐడీ సైబర్‌క్రైమ్ పేర్కొంది. గత సంవత్సరం ఏప్రిల్ 20 నుంచి ఈ నెల 3 వరకు 50,788 ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు ప్రకటించింది. ఈ విషయంలో దేశంలో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా తరువాతి స్థానంలో తెలంగాణ ఉన్నట్లు తెలిపింది. మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన నేరసమీక్ష సందర్భంగా సెల్‌ఫోన్ల రికవరీలో ప్రతిభకనబరిచిన 11 యూనిట్ల అధికారులతోపాటు 10 పోలీస్ స్టేషన్ల అధికారులకు డీజీపీ డా.జితేందర్ ప్రశంసాపత్రాలు అందించారు. యూనిట్ల స్థాయిలో నోడల్ అధికారులకు, పోలీస్ స్టేషన్ల స్థాయిలో ఎస్‌హెచ్‌వోలకు అందజేశారు.
TG Police Recovery 50k Mobiles :సీఐడీ సైబర్‌క్రైమ్ ఎస్పీ డా.ఎన్‌జేపీ లావణ్య నేతృత్వంలోని బృందాన్ని డీజీపీ డా.జితేందర్ ప్రత్యేకంగా అభినందించారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సీఈఐఆర్ వెబ్‌సైట్‌తోపాటు టీఎస్‌పోలీస్ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. సమీక్షలో సీఐడీ డీజీ శిఖాగోయెల్, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ మహేశ్‌భగవత్, ఐజీలు సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.