Ministers on Officers Responsibilities in Telangana : ప్రజలకు అవసరమైన మందులు ఎందుకు అందుబాటులో లేవో సమాధానం చెప్పాలని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిలదీశారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ ముందస్తుగా ఔషధాలు ఎందుకు సమకూర్చుకోలేదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర వద్ద నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మందుల కొరత అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన రాజనర్సింహ జిల్లా వైద్య విధానానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజారోగ్యమే ముఖ్యమని, అందుబాటులో లేని మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.
'ప్రజలకు అవసరమైన మందులు ఎందుకు అందుబాటులో లేవు. ఎందుకు జ్యాపం జరిగింది? ఎందుకు కొరత వచ్చింది? అన్ని వ్యాధులకు సరైన మందులు అందుబాటులో ఉండాలి' - రాజనర్సింహ, ఆరోగ్య శాఖ మంత్రి
మిషన్ భగీరథ పనుల కోసం రూ.200 కోట్ల నిధులు : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిధులు అద్భుతుంగా పని చేశారని వారి సేవల్ని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. యాదగిరిగుట్ట అభివృద్ధి పనులపై సీఎంను ఆహ్వానించి సమీక్ష చేస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో మిషన్ భగీరథను పూర్తి చేయడానికి అవసరమైన రూ.200 కోట్ల నిధులను అందిస్తామని భరోసా ఇచ్చారు.