Lok Sabha Polling Arrangements in Telangana :రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. తీవ్రవాద ప్రాబల్యమున్న 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుండగా, మిగతా 106 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు కొనసాగనుంది.
ఈ నియోజనవర్గాల్లో 4గంటల వరకే పోలింగ్ :ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి సెగ్మెంటు, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో సాయంత్రం 4 వరకే పోలింగ్ ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకే పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించినప్పటికీ, ఎండ తీవ్రత ఉన్నందున సమయం పెంచాలని రాజకీయ పార్టీలు కోరడంతో సాయంత్రం 6 వరకు పొడిగించారు.
నాలుగో విడతలో తెలంగాణలో లోక్‌సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంటు ఉపఎన్నిక నిర్వహించేందుకు మార్చి 16న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించింది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేసి అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా 285 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 45 మంది పోటీలో ఉండగా అతితక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం నిన్నటితో ముగిసింది.
35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు :సోమవారం పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పోలింగ్ శాతం పెంచేందుకు కుమురం భీం ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిర్మల్, మెదక్, భువనగిరి, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లో అతికొద్ది మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఈ సారి అదనంగా 453 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 61 పోలింగ్ కేంద్రాల్లో పది మంది లోపే ఓటర్లు ఉన్నారు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లోని మన్ననూరులో కేవలం 10 మంది ఓటర్లే ఉన్నారు. 11 కేంద్రాల్లో 25 లోపు, 22 పోలింగ్ కేంద్రాల్లో 50లోపు 54 కేంద్రాల్లో వందలోపు ఓటర్లు ఉన్నారు.
పోలింగ్ బూత్‌లో ఆరుగురు సిబ్బంది ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు ఏపీవోలు, ఒక ఓఏపీ, ఒక బీఎల్వో, ఒక వాలంటీర్ విధుల్లో ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 94వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రంలో 597 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలు, 119 బూత్‌ల్లో దివ్యాంగులు, 119 కేంద్రాల్లో యువత మాత్రమే పోలింగ్ విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 229 భవనాల్లో 6కు మించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఉన్నందున పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు, వైద్యసదుపాయాలతో పాటు కుర్చీలు, ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని అధికారులను సీఈవో వికాస్‌రాజ్ ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.