తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 7:21 PM IST

ETV Bharat / state

కళ్లకు గంతలతో జూడాల నిరసన - 24 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిక - junior doctors protest in Telangana

junior doctors protest: హైదరాబాద్‌ ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు. కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 24 నుంచి సమ్మెలోకి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

junior doctors protest
junior doctors protest (ETV Bharat)

junior doctors protest: జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. స్టైఫండ్ నెలనెలా చెల్లించడంతో పాటు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. గత మూడు రోజులుగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఆస్పత్రులలో మౌలిక సదుపాయాలు లేక, ప్రభుత్వం నుంచి వచ్చే స్టైఫండ్ నెలనెలా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించామని, కానీ తగిన స్పందన రాలేదని జూడాలు పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సమ్మెకు వెళ్లేకంటే ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. గురువారం రోజు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. శుక్రవారం రోజు నల్లదుస్తులు ధరించారు. శనివారం రోజు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో జూడాలు నిరసనలు తెలిపారు. ప్రధానంగా స్టైఫండ్ సకాలంలో అందడం లేదని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలోనూ విజ్ఞప్తి చేసినా హామీలు అమలు కాలేదని, కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే, ఎన్నికల కోడ్ కారణంగా వేచి చూడాలన్నారని, ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదని జూడాలు చెబుతున్నారు.
ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మె నోటీసు..

ప్రధాన డిమాండ్లు పరిష్కారమే లక్ష్యంగా జూనియర్ డాక్టర్లకు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. స్టైఫండ్లు నెలనెలా సకాలంలో విడుదల చేయాలని దీనికోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం ఉన్నా.... రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదని జూడాలు చెబుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు. జూనియర్ డాక్టర్లు కొత్త వసతి భవనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్​లకు గౌరవ వేతనం పెంచాలని కోరుతున్నారు. చాలా ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యులకు కనీస భద్రత లేదని, సెక్యూరిటీని ఏర్పాటు చేయాలంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. కాకతీయ మెడికల్ కళాశాలలో రహదారులు మెరుగుపర్చాలంటున్నారు. నీట్‌లో ఎంబీబీఎస్ సీట్లకు 15శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మె సమయంలో ఓపీ, ఎలక్టివ్స్, వార్డుల్లో సేవలు నిలిపేయాలని జూడాలు నిర్ణయించుకున్నారు. నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని జూనియర్ డాక్టర్ల సంఘం నిర్ణయించుకుంది. 8 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదిలేదని జూడాలు చెబుతున్నారు.

‘అధికారుల చుట్టూ తిరగకుండా ప్రతి నెలా నిర్దిష్టమైన తేదీకి స్టైఫండ్‌ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. కానీ, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉస్మానియా ఆసుపత్రి భవనం మూసి వేసి నాలుగేళ్లు అయ్యింది. పక్కనే ఉన్న మరో భవనంలోకి ఆసుపత్రి మార్చారు. విపరీతమైన రద్దీ కారణంగా ఇన్‌ఫెక్షన్ల శాతం పెరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి'- లేదంటే ఈనెల 24′ నుంచి సమ్మెను ప్రారంభించి నిరవధికంగా కొనసాగిస్తాం'-.దీపాంకర్‌, జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు

ఆదిలాబాద్ రిమ్స్​లో జూనియర్ డాక్టర్ల నిరసన - డైరెక్టర్​ను తొలగించాలంటూ డిమాండ్

ABOUT THE AUTHOR

...view details