Telangana High Court on Pond Encroachments : చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని, వాటిలోని జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్ హైకోర్టు(Telangana High Court)కు లేఖ రాశారు. చెరువుల్లో నీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అభివృద్ధి పేరుతో అక్రమణలు పెరిగి చెరువుల్లో నిర్మాణాలు వెలుస్తుండటం పర్యావరణ సమతుల్యతకు ప్రమాదమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని స్పందించాల్సిన అవసరం ఏంతైనా ఉందని పేర్కొన్నారు.
ఈనాడులో మార్చి 21న ప్రచురితమైన నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విల్లాలు శీర్షికతో ప్రచురితమైన కథనంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ స్పందించి ఈ లేఖను రాశారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 90కి పైగా చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనట్లు ఈనాడులో కథనం ప్రచురితమైంది. పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్, పటాన్చెరు, జిన్నారం, ఆర్.సీ.పురం మండలాల్లో 69 చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనట్లు వెలుగులోకి తెచ్చింది. అలాగే సంగారెడ్డి నియోజవర్గంలోని సంగారెడ్డి, కంది మండలాల్లోనూ ఈ ఆక్రమణలు జరిగాయి. నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలాల్లో 20పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి.
చెరువుల్లో మట్టి నింపి నిర్మాణాలు : ఈ నియోజకవర్గ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల చెరువుల్లో మట్టి నింపి ఏకంగా 14 అంస్తులతో భవనాలు నిర్మించారు. అమీన్ పూర్ మండలంలోని ఉప్పరవానికుంటలో మొత్తం 6.11 ఎకరాల మేరు ఆక్రమణలకు గురైంది. ఈ సమస్యకు ప్రధాన కారణం పోలీసుల, నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా నీటి వనరులను ఆక్రమించుకుంటున్నారని లేఖలో రాశారు. ఈ అంశాలపై ప్రచురితమైన కథనంపై న్యాయమూర్తి స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరో తరగతి విద్యార్థిని లేఖకు స్పందించిన హైకోర్టు - బార్ & రెస్టారెంట్‌పై ప్రభుత్వానికి నోటీసులు