Telangana HC On Additional Seats in Engineering Courses : కొత్త కోర్సులను ప్రారంభించేందుకు సీట్లపెంపు, కుదింపునకు, కోర్సుల విలీనానికి, రద్దుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్‌చేస్తూ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన సుమారు 30 దాకా పిటిషన్లపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, కాలేజీలు ఏఐసీటీఈ నుంచి ఆమోదం పొంది, జేఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు తీసుకున్నట్లు తెలిపారు.
కంప్యూటర్ కోర్సు, అనుబంధ కోర్సులను సీట్లను పెంచుకోవడానికి జేఎన్‌టీయూ ఎన్వోసీ జారీ చేసిందన్నారు. దీని ఆధారంగా కాలేజీలు ఏఐసీటీఈ ఆమోదానికి దరఖాస్తు చేయగా తనిఖీలు చేసి మౌలిక వసతులు, బోధనా సిబ్బంది ఉండటంతో అనుమతి మంజూరు చేసిందన్నారు. ఐతే ప్రభుత్వ అనుమతితో కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న ఏఐసీటీఈ షరతు మీద ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు.
సీట్ల పెంపునకు ఫీజు రియంబర్స్మెంట్ కారణం కాదు:ఐతే కాలేజీల ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖ తిరస్కరించిందన్నారు. డిమాండ్‌ను బట్టి సంప్రదాయ కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించి డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచితే ప్రభుత్వానికి నష్టంలేదన్నారు. ఎలాంటి కారణాలు పేర్కొనకుండా దరఖాస్తులను తిరస్కరించడం చెల్లదన్నారు. కోర్సుల్లో సీట్ల పెంపు, తగ్గింపు, విలీనం అంశాలను విస్తృత కోణంలో చూస్తుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అందుబాటులో ఉన్న మౌలిక వసతులు బోధనా సిబ్బంది. విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. షరతులతో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జేఎన్టీయూ జారీచేస్తుందని, దానిఆధారంగా కాలేజీలు ఏఐసీటీఈ నుంచి అమోదం తీసుకొని సర్కార్ అనుమతి పొందాల్సి ఉందన్నారు. సీట్ల పెంపునకు ఫీజు రీయంబర్స్మెంట్ వంటి ఆర్ధిక పరిమితులే కారణం కాదన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ లేకుండా విద్యార్థులే ఫీజు చెల్లించుకునేట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్య అందించడానికి ముందుకు రావాల్సి ఉందన్నారు.