TG High Court On Party Defection : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలన్న వ్యాజ్యాలపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ని ప్రశ్నించింది. ఇప్పటికే నెల గడిచిందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఇంకో మూడు నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అంటూ ప్రశ్నించింది.
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి.వివేకానంద్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారించారు.
ఈ సందర్భంగా కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నంతవరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీని ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి సమాధానమిస్తూ, ఇవి రాజ్యాంగపరమైన అంశాలని వాటిని కోర్టులు దాటవేయలేవని పేర్కొన్నారు. పిటిషనర్లు కౌశిక్‌రెడ్డి, కెపి. వివేకానంద్‌లు స్పీకర్‌కు ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే హైకోర్టులో వ్యాజ్యాలు వేశారని తెలిపారు.
వాటిని పరిశీలించడానికి స్పీకర్‌కు తగిన గడువు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పిటిషనర్లు స్పీకర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికాదని ఏజీ వాదించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు జోక్యం చేసుకోజాలవని సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాత వాటిని సమీక్షించవచ్చని వ్యాఖ్యానించారు.