Handloom Weaver Selected for National Handloom Award : చేనేత చీరల తయారీ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు తెలంగాణ. ఎందుకంటే ఇక్కడికి దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా మగ్గం చీరలను కొనుగోలు చేయడానికి అతివలు వస్తుంటారు. ముఖ్యంగా పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల చేనేత చీరలకు ఉన్న గిరాకీనే వేరు. రేటు ఎంతైనాసరే కచ్చితంగా ఆ చీర ఇంటి బీరువాలో ఉండాలనుకునే వారు అనేకం. అదో హోదాకు సంబంధించిన విషయంగా కూడా చాలా మంది భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేనేత చీరకు ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఉంటూ ఉంది. ఇలాంటి డిమాండ్ ఉండడం వల్లే దేశవిదేశాల్లో అనేక అవార్డులను తెలంగాణ చేనేత చీర కొల్లగొడుతుంది. తాజాగా ఓ చేనేత కళాకారుడు నేసిన పర్యావరణహిత చీర వల్ల జాతీయ స్థాయిలో ఇంకా తన గుర్తింపును పెంచుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడేనికి చెందిన కర్నాటి ముఖేశ్ పర్యావరణ హితంగా ఓ చీరను ప్రత్యేకంగా మగ్గం మీద నేశాడు. ఇప్పుడు ఆ చీర జాతీయ చేనేత పురస్కారానికి ఎంపిక అయింది. కేంద్ర చేనేత, జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయస్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అయితే వారందరిలో తెలంగాణ నుంచి ఎంపికైన ముఖేశ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో తెలంగాణ చేనేత చీర మరోసారి జాతీయస్థాయిలో తన ముద్రను వేసింది. ఈ అవార్డు రావడం పట్ల ఆ యువకుడు ఆనందం వ్యక్తం చేశారు.
2022లో కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారం : బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివిన ముఖేశ్ బాల్యం నుంచే తాత, తండ్రి వారసత్వంగా చేనేత వృత్తిని చేపట్టి దాన్నే జీవనాధారంగా గడుపుతున్నాడు. గత పదిహేనేళ్లుగా ఇదే రంగంపై ఆధారపడి ఆయన ఉన్నారు. ఈ జాతీయ పురస్కారం కంటే ముందే 2022లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రెండేళ్ల పాటు శ్రమించి ప్రకృతి సిద్ధమైన పర్యావరణహితమైన చీరను తయారు చేశారు. ప్రకృతి నుంచి సేకరించిన పది రకాల రంగులు అద్ది, వంద పూల డిజైన్లతో ప్రత్యేకంగా నేసిన డబుల్ ఇక్కత్ ప్రకృతి రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది.