Story On Manjeera Wild Life Sanctuary :అహ్లాదకరమైన వాతావరణం, ఎన్నో జాతుల పక్షులు, వన్యప్రాణులకు నిలయంగా ఉంది మంజీర అభయారణ్యం. ఈ ప్రదేశానికి 'రాంసర్ సైట్' గుర్తింపు దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. అత్యంత సుందరమైన స్వచ్ఛమైన ప్రాంతం మంజీర అభయారణ్యం. ప్రకృతి సోయగాలు అందరినీ కనువిందు చేస్తాయి. ఇక్కడ ఉన్న ద్వీపాల్లో కొండచిలువలు, తాచుపాములు, దుప్పులు, అడవిపిల్లి మొదలైన అనేక జంతువులు ఉన్నాయి.
జీవవైవిధ్య భరితంగా అభయారణ్యం :సంగారెడ్డి జిల్లా కల్పగూరు శివారులో మంజీర జలాశయం నిర్మాణానికి 1962లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీటి సరఫరాతో పాటు నిజాంసాగర్ సామర్థ్యం కోసం దీన్ని నిర్మించారు. ఆ తర్వాత వన్యప్రాణుల సంరక్షణకు అనువైన ప్రదేశం కావడంతో జలాశయం ప్రాంతాన్ని 1978లో అభయారణ్యంగా గుర్తించారు. ఇందులో భాగంగా మెుసళ్ల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బయట ప్రాంతాల్లో ఎక్కడ మెుసలి కనిపించినా ఇక్కడికి తరలించి సంరక్షిస్తున్నారు. మొసళ్ల సంతాన వృద్ధికి సైతం ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం గమనార్హం.
చిత్తడి నేలల పరిశీలనకు అధికారుల బృందం :సింగూరు నుంచి మంజీరా వరకు 9 ద్వీపాలు ఉంటాయి. ఈ ద్వీపాలకు చేరుకోవాలంటే కేవలం పడవ ద్వారానే చేరుకోగలుగుతాం. దీంతో ఆ ద్వీపాలు జంతుజాలానికి నివాసాలుగా ఉన్నాయి. ద్వీపాల్లోని చెట్ల కొమ్మలను వలస పక్షులు స్థావరాలుగా చేసుకుంటున్నాయి. శీతాకాలం ప్రారంభంలో దేశ, విదేశాల నుంచి లక్షలాది పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని వేసవి ముగిసే సమయంలో తమ సొంత ప్రాంతాలకు తిరిగి పయనమవుతుంటాయి. రకరకాల పక్షులతో పాటు రాంసర్ గుర్తింపునకు కావాల్సిన చిత్తడి నేలలు ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి. వాటిని పరిశీలించడానికి కేంద్ర నుంచి అధికారుల బృందం మంజీరా నదిని పరిశీలించారు.
రాంసర్ సైట్‌గా గుర్తింపు దిశగా అడగులు :చిత్తడి నేలలు సంరక్షించి జీవవైవిద్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రాంసర్‌లో యునెస్కో ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా చిత్తడి నేలలను రాంసర్ సైట్‌లుగా గుర్తిస్తున్నారు. ఈ జాబితాలో మంజీరాను చేర్చాలన్న లక్ష్యంలో అధికారులు కార్యచరణతో ముందుకు సాగుతున్నారు.