Telangana Govt Proposals in the Union Budget Meeting : అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచింది. సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేంద్రం నుంచి అందాల్సిన సహకారాన్ని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా సమావేశమైన భట్టి, కొన్ని అంశాలను ప్రత్యేకంగా తెలిపారు.
రాష్ట్రాల మూలధన వ్యయానికి ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని ఏడాదికి రూ.రెండున్నర లక్షల కోట్లకు పెంచడంతో పాటు షరతులు, ఇతర పరిమితులు లేకుండా నిధులను విడుదల చేయాలని కోరారు. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలను పునః సమీక్షించి, అనవసరమైన పథకాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టాలని సూచించారు. నిరుద్యోగం, ఆదాయ పంపిణీలో అసమానతలు దేశంలో ఉన్న ప్రధాన సమస్యలుగా పేర్కొన్న భట్టి విక్రమార్క, ఈ రెండు సమస్యల కోసం బడ్జెట్‌లో కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటికి ఎక్కువ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించగా, ఐటీఐలను ఏటీసీలుగా మార్చే కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ సమస్యను అధిగమించేలా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని, రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రత్యేక ఆర్థిక సహాయంతో ఆధునీకరించాలని సమావేశంలో భట్టి ప్రతిపాదించారు.
సెస్‌లు, సర్ ఛార్జీల పెంపు రాష్ట్రాలకు నష్టం :ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గడంతో పాటు సెస్‌లు, సర్ ఛార్జీల ద్వారా సేకరించిన మొత్తం పెరగడంతో రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. సెస్‌లు, సర్ ఛార్జీలు మొత్తం పన్ను ఆదాయానికి పది శాతం మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రాల రుణపరిమితిని బడ్జెట్ తర్వాత కేంద్రం ఖరారు చేస్తున్నందున ప్రణాళిక ఇబ్బంది అవుతోందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సీలింగ్ తెలిపితే రాష్ట్రాలు అభివృద్ధి కార్యక్రమాలపై తమ వనరులను సమర్థంగా ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ఉపముఖ్యమంత్రి కేంద్ర ఆర్థికమంత్రి ముందు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో గొప్ప పురోగతి సాధించడంతో పాటు, జాతీయ ఆర్థికవ్యవస్థకు విలువైన భాగస్వామిగా ఉందన్న ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే పరిష్కారం చూపాల్సిన సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు.