తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన యాసంగి ధాన్యం కొనుగోళ్లు - మూడ్రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు - RABI PADDY PROCUREMENT IN TELANGANA - RABI PADDY PROCUREMENT IN TELANGANA

Rabi Paddy Procurement in Telangana 2024 : రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసింది. యాసంగి సీజన్‌లో 8,99,546 మంది రైతులకు రూ. 10547 కోట్ల చెల్లింపులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన తర్వాత మూడు రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1532 మంది రైస్ మిల్లర్లు ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన జాబితాలో ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 116 మందిపై సివిల్ సప్లయిస్ విభాగం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 మే చివరి వరకు 28 వేల మెట్రిక్ టన్నుల దాకా కస్టమ్ మిల్లింగ్ రైస్ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ పేర్కొంది.

Telangana Yasangi Paddy Procurement 2024
Rabi Paddy Procurement in Telangana 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 8:00 PM IST

Telangana Yasangi Paddy Procurement 2024 :రాష్ట్రంలో యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసింది. 2023-24 సంవత్సరం రబీలో వడ్లు కొనుగోళ్లు వేగంగా పూర్తి చేసిన ప్రభుత్వం అంతే వేగంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు కేవలం మూడు రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది. మొత్తం 8,99,546 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.10547 కోట్ల రూపాయలు జమ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

Rabi Paddy Procurement: గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తైనప్పటికీ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించటంలో విఫలమైందని ప్రభుత్వం ప్రస్తావించింది. ఈసారి రైతులు డబ్బులకు ఎదురుచూసే పరిస్థితి ఉండవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ ధాన్యం అమ్మిన రైతులందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించి కొత్త రికార్డు నెలకొల్పిందని ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ముందుగా ప్రారంభించింది. ఏప్రిల్‌లో కాకుండా ఈసారి రెండు వారాలు ముందుగా మార్చి 25వ తేదీ నుంచే కొనుగోళ్లు ప్రారంభించింది. రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచింది.

రికార్డు స్థాయిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు - మూడ్రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు - RABI PADDY PROCUREMENT IN TELANGANA 2024

48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు : గత ఏడాది ఇదే సీజన్లో కేవలం 6889 సెంటర్లు నెలకొల్పింది. జూన్ 30వ తేదీ వరకు రబీ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించింది. రాష్ట్రమంతటా 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని పౌరసరఫరాల శాఖ మొదట్లో అంచనా వేసింది. కానీ, మార్కెట్‌లో మద్ధతు ధర కంటే ఎక్కువ రేటు రావటం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరలకు కొనుగోలు చేయటంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం అంచనా తగ్గినట్లు తెలిపింది.

ఈదురు గాలులు, అకాల వర్షాలకు కూడా రైతులు నష్టపోకుండా ఈసారి కొనుగోలు కేంద్రాల్లో పౌరసరఫరాల శాఖ పక్కాగా ఏర్పాట్లు చేసి సీఎం ఆదేశాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం తిరిగి ఇవ్వకుండా బకాయి పడ్డ రైస్ మిల్లర్లకు ఈసారి ధాన్యం కేటాయించలేదు. గతంలో సీఎంఆర్ ఇవ్వకుండా పలువురు రైస్‌ మిల్లర్లు తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో నూటికి నూరు శాతం సీఎంఆర్‌ అప్పగించిన మిల్లర్లకు మాత్రమే ధాన్యం కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ బియ్యానికి ఓ బ్రాండ్‌ ఉంది - రైతులను నిరుత్సాహ పరిచే వార్తలు రాయొద్దు : డీఎస్​ చౌహన్‌ - TELANGANA RABI PADDY PROCUREMENT

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పూర్తి కాని ధాన్యం కొనుగోళ్లు - రైతన్నలకు తప్పనితిప్పలు - Paddy Procurement in Telangana 2024

ABOUT THE AUTHOR

...view details