TG Govt Planning To GiveElectric Autos To Women :ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) నూతన పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై కసరత్తు చేస్తుంది. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలుచేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఆమెకు ఎలక్ట్రిక్ ఆటో: ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఓ కొత్త పథకం రూపకల్పనపై కసరత్తు చేస్తుంది. మహిళలకు ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే ఓ సంస్థ ఆ శాఖ అధికారుల్ని ఇటీవల కలిసింది. కాగా ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని భరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.
నడపడం తేలికే : ఆటో డ్రైవింగ్ కొంత కష్టంగా ఉంటుంది. అందుకే ఈ రంగంలో మహిళా డ్రైవర్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కొంత కాలంగా ఈవీల ఉత్పత్తి పెరుగుతుంది. జహీరాబాద్‌లో ఎలక్ట్రిక్ ఆటోల ప్లాంట్ ఒకటి ఉంది. డీజిల్, సీఎన్జీతో నడిచే ఆటోలతో పోలిస్తే ఎలక్ట్రిక్ ఆటోలను నడపడం తేలిక. దీంతో ఆ కంపెనీ, సోదర సంస్థ కలిసి ఇప్పటికే కొందరు మహిళలకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇస్తుంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నవారికి వేతనం ఇచ్చి మరీ నడిపిస్తుంది. కొందరికి అద్దెకు కూడా ఇస్తుంది. కుటుంబ అవసరాల కోసం ఉపాధిని వెతుక్కుంటున్న మహిళలు డ్రైవింగ్ శిక్షణ తీసుకుంటున్నారు.