Telangana power purchase Issue : విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లు, అమ్మకాలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వంపై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విద్యుత్ కొనుగోలు, అమ్మకాల్లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనేలా అనుమతించాలంటూ గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియాను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది.
విద్యుత్ కొనుగోళ్లలో అంతరాయం :రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను డిస్కంలు ప్రతిరోజూ ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు చేస్తుంటాయి. ఈరోజు డిస్కంలు బిడ్‌లలో పాల్గొనలేకపోయాయి. విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన రూ.261 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదని తక్షణమే చెల్లించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ఛత్తీస్‌గఢ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలు విద్యుత్తు బిడ్లలో పాల్గొనకుండా గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అడ్డుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.
హైకోర్టులో పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం :ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారించారు. 2వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని అయితే ప్రస్తుతం వేయి మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. కొనుగోలు చేసినా చేయకపోయినా రూ.261కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మెలికపెట్టిందని దీన్ని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి దృష్టికి తీసుకెళ్లామని అడ్వకేట్ జనరల్ వాదించారు.