Telangana Govt Felicitates Padma Award Winners 2024 : ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి సహా పద్మ పురస్కారాలు అందుకున్న వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువా, మెమెంటోలతో సత్కరించారు. ఇందులో భాగంగా మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
జీవితంలో పెద్దగా అవార్డులు, సన్మానాలు తీసుకోలేదన్న వెంకయ్యనాయుడు, కేవలం ప్రధాని మోదీ మీద గౌరవంతో పద్మ విభూషణ్ తీసుకున్నానని తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని రాష్ట్ర ప్రభుత్వం శిల్పకళావేదికగా సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు కొనియాడారు.
నేను జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదు. ప్రధాని మోదీ మీద గౌరవంతోనే పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అభినందిస్తున్నా. మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయం. చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉంది. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, చిరంజీవి మూడో కన్ను. - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
ఆ క్షణం అంతాఇంతా ఆనందం కాదు - 'గద్దర్ పురస్కారాలు'గా నంది అవార్డులు మంచి నిర్ణయం : చిరంజీవి