Telangana Govt Exercise on Job Calendar :తెలంగాణలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు సంవత్సరాలకు సంవత్సరాలు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏటా జనవరి 1న టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్లు ప్రకటించాలని భావిస్తోంది.
Telangana Job Calendar :గ్రూప్-1, 2, 3, 4లతో పాటు అన్ని విభాగాల్లో నిరంతరం ఉద్యోగాల ప్రకటనలు (JOB Notifications) వెలువరించడం వల్ల పరీక్షలకు ఉద్యోగార్థులు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్ క్యాలెండర్ సిద్ధమవుతోంది. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి పంపించనుంది. సర్కార్ అనుమతించిన వెంటనే ఈ ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.
నోటిఫికేషన్లు, పరీక్షలకు గడువు :నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ (TSPSC) నిర్ణయం తీసుకుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తరువాత ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు? ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలకు స్పష్టమైన గడువు ఉంటుంది. ఆ గడువులోగా నియామకాలు పూర్తవుతాయి.
ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
TSPSC Exercise on Job Calendar :ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకుంటోంది. సర్వీసు నిబంధనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం, ఖాళీల గుర్తింపు, సర్కార్ నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుంటోంది. అదేవిధంగా నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వాహణలో ఎలాంటి లోపాలు లేకుండా కోర్టు కేసుల్లో చిక్కకుండా నియామకాలు ఆలస్యం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంపై కసరత్తు చేస్తోంది. జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే టీఎస్‌పీఎస్సీతో పాటు పోలీసు, గురుకుల, వైద్యఆరోగ్య నియామక బోర్డుల నుంచి నిరంతర ఉద్యోగ ప్రకటనలు వెలువడుతాయి.
మరోవైపు ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్లు జాబ్ క్యాలెండర్‌ను (Telangana Job Calendar) విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లుగా సర్కార్ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారిలో ఈ ప్రకటనలు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ఈసారి ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో వారు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వెలువడితే ఏడాదంతా పరీక్షల సమయంగా నిలవనుంది. నిరుద్యోగుల కష్టాలు తీర్చేలా వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేలా రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలను విద్యావేత్తలు, మేధావులు, ఉద్యోగార్థులు స్వాగతిస్తున్నారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్ తేదీలు విడుదల - ఆగస్టులో గ్రూప్2 పరీక్షలు
జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - టీఎస్‌పీఎస్సీ ప్రకటన