తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ రద్దు - మిగిలిన పనులను అదే సంస్థతో చేయించాలని ప్రభుత్వ ఆదేశాలు - Telangana Govt On Medigadda Works - TELANGANA GOVT ON MEDIGADDA WORKS

Telangana Govt Decided To Cancel Medigadda Work Completion Certificate : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పని పూర్తయిందని నిర్మాణ సంస్థకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ఇంజినీర్లను ఆదేశించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంజినీర్ ఇన్ ఛీప్​కు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు.

Telangana Govt On Medigadda Works
Telangana Govt Decided To Cancel Medigadda Work Completion Certificate (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 1:26 PM IST

Telangana Govt On Medigadda Works : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పని పూర్తయిందని నిర్మాణ సంస్థకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ఇంజినీర్లను ఆదేశించింది. ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే చట్ట విరుద్ధంగా ఇచ్చిన సర్టిఫికెట్​ను రద్దు చేయడంతో పాటు మిగిలిన పనులను నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలని తెలిపింది. ఈమేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంజినీర్ ఇన్ ఛీప్​కు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు.

అదే నిర్మాణ సంస్థతో మిగిలిన పనులు :దెబ్బతిన్న నిర్మాణాలకు మరమ్మతులు చేయాలని, ఒప్పందం ప్రకారం పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని గుత్తేదారుకు లేఖ రాసిన ఇంజినీర్లు ఇవేమీ చేయకుండానే పని పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వడం, ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వాలని గుత్తేదారు కోరి తీసుకోవడాన్ని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తప్పుపట్టింది. ఒప్పందం ప్రకారం క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అయితే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌కు ఇచ్చినా ఇంకా తన వద్దకు చేరకముందే పని పూర్తయినట్లు గుత్తేదారుకు ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకొంది.

అండర్‌టేకింగ్‌ తీసుకోకుండానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్‌ 21న కేసీఆర్‌ ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టు 6న నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ-పీఈఎస్‌ సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు లేఖ రాసింది. పని పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్‌ ఇవ్వాలని కోరింది. అయితే ఇందుకు అన్ని రకాలుగా సంతృప్తికరంగా పని పూర్తయిందని, తుది పరీక్షల్లోనూ పాస్‌ అయిందని, నిర్వహణ సమయంలో ఏమైనా సమస్యలు వస్తే పునరుద్ధరిస్తామనీ నిర్మాణ సంస్థ అండర్‌టేకింగ్‌ ఇవ్వాలి.

ఈ నోటీసు అందిన 21 రోజుల్లో ఇంజినీరు తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నిర్మాణ సంస్థ అండర్‌టేకింగ్‌ ఇవ్వలేదని విజిలెన్స్‌ నివేదిక ఇచ్చింది. అయితే 2020 మే 18న అప్పటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రమణారెడ్డి నిర్మాణ సంస్థకు నోటీసు ఇచ్చారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయని, వియరింగ్‌ కోట్‌ దెబ్బతిందని వీలైనంత త్వరగా బాగు చేయాలని తెలిపారు.

దీనికి నిర్మాణ సంస్థ సమాధానమిస్తూ 2019 నవంబరు నుంచి బ్యారేజీ దిగువన డ్యామేజెస్‌ గుర్తిస్తున్నామని, వీటిని సీరియస్‌గా తీసుకొని అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అన్నారం, సుందిళ్లలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. బ్యారేజీ కింద డ్యామేజెస్‌ ఉన్నట్లు గుర్తించామని స్పష్టంగా చెప్పిన నిర్మాణ సంస్థ దీనికి భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వాలని 2020 అక్టోబరు 12న మరోసారి లేఖను రాసి పంపింది.

నీటిపారుదల శాఖ ఆదేశాలు : 2019 జూన్‌ నుంచి మేడిగడ్డ పూర్తిగా నిర్వహణలో ఉందని, పూర్తిస్థాయి నీటిమట్టంలో 16.2 టీఎంసీలు నిల్వ చేశారని, ఎలాంటి సమస్య లేకుండా 15 నెలలుగా ఆపరేషన్‌లో ఉందని పేర్కొంది. అయితే ఆ లేఖ వాస్తవానికి భిన్నంగా ఉందన్న విషయాన్ని ప్రస్తావించకుండానే బ్యారేజీ దిగువన జరిగిన డ్యామేజెస్‌ను బాగు చేయడంతోపాటు ఒరిజినల్‌ పనుల్లో ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేయాలంటూ నిర్మాణ సంస్థకు 2021 ఫిబ్రవరి 17న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ లేఖ రాశారు.

దీనిపై నిర్మాణ సంస్థలు స్పందించలేదని పునరుద్ధరణ పనులు చేయలేదని విజిలెన్స్‌ నివేదిక తెలిపింది. మళ్లీ 2021 మార్చి 10న పని పూర్తయినట్లుగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని నిర్మాణ సంస్థ లేఖ రాయగా అండర్‌టేకింగ్‌ తీసుకోకుండానే 2021 మార్చి 15న సర్టిఫికెట్‌ ఇచ్చారు. పని పూర్తయినట్లుగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తిరుపతిరావు ఫైనల్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆ సమయంలో ఎస్‌ఈగా ఉన్న రమణారెడ్డి కౌంటర్‌ సంతకం చేశారు.

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక :బ్యారేజీ దిగువన దెబ్బతిన్న పనులు పూర్తి చేస్తామని అండర్‌టేకింగ్‌ తీసుకోకుండానే పని పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చినందు వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతినడంతో పాటు ఖజానాకు నష్టం వాటిల్లిందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తెలిపింది. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొంది. తాజాగా నిర్మాణ సంస్థకు ఇచ్చిన సర్టిఫికెట్‌ రద్దు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశించడంతో శాఖలో చర్చనీయాంశంగా మారింది. బ్యారేజీ ఇంజినీర్లు మాత్రం సర్టిఫికెట్‌ రద్దుకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదని తెలిసింది. సర్టిఫికెట్‌ ఇచ్చిన ఇంజినీర్లే ఇప్పటికీ అక్కడ ఆ స్థానాల్లో ఉండటం గమనార్హం.

కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ : కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడిని విచారించనున్న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్ - JUSTICE GHOSE on KALESHWARAM

మేడిగడ్డకు మళ్లీ పీసీ ఘోష్ కమిటీ - అఫిడవిట్ల పరిశీలన తర్వాత చర్యలు

ABOUT THE AUTHOR

...view details