తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకపై అందరికీ 'కామన్ డైట్' - నేటి నుంచి గురుకులాల బాట పట్టనున్న సర్కార్​ - GOVT TO VISIT GURUKULAS FROM TODAY

నేటి నుంచి గురుకులాల బాట పట్టనున్న ప్రభుత్వం - సీఎం, మంత్రులు సహా కీలక యంత్రాంగం గురుకులాల సందర్శన - విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్న సీఎం, మంత్రులు

Govt
Govt TO Visit Gurukulas From Today (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2024, 9:58 AM IST

Updated : Dec 14, 2024, 10:18 AM IST

Govt TO Visit Gurukula's From Today : ప్రభుత్వం నేటి నుంచి గురుకులాల బాట పట్టనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు సహా కీలక యంత్రాంగం గురుకులాలను సందర్శించనుంది. విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించి, అంచనా వేయనున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన విద్యార్థుల సంక్షేమం, గురుకులాల అభివృద్ధికి ప్రణాళికలు చేయనున్నారు. అన్ని గురుకులాల్లో కామన్ డైట్‌ను ఇవాళ ప్రారంభించనున్నారు.

గురుకులాల్లో పరిస్థితులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేసి గడిపేందుకు నేడు ప్రభుత్వ పెద్దలందరూ కదలనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను సందర్శించనున్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, జనరల్‌ గురుకులాలన్నీ కలిపి సుమారు 1000 ఉన్నాయి. గురుకులాల్లో కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, పరిస్థితులను చక్కదిద్దేందుకు సన్నద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలను స్వయంగా సందర్శించి పరిస్థితులను స్వయంగా అంచనా వేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఒక హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ చేయనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర, బోనకల్‌లోని గురుకులాలను సందర్శిస్తారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లా మైలారం, ఘన్‌పూర్‌లో, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లా మాదిరిపురం, తిరుమలాయపాలెంలోని గురుకులాలను తనిఖీ చేస్తారు. పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ షేక్‌పేట, కొండా సురేఖ సంగారెడ్డి జిల్లా హత్నూర, సీతక్క ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ, తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండుగులపల్లి, జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో తనిఖీలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు కూడా గురుకులాలను సందర్శించనున్నారు.

అందరినీ 'కామన్ డైట్' : గురుకులాల్లో నేటి నుంచి ఒకే తరహా భోజనం మెనూ అమల్లోకి రానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో ఇప్పటి వరకు వేర్వేరుగా మెనూ ఉంది. అన్నింటిలో ఒకే తీరుగా భోజనం అమలు చేయనున్నారు. కామన్ డైట్ మెనూను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించనున్నారు. కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 65 వేల మంది విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలు 200 శాతం పెంచింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.667 కోట్లను కేటాయించింది. గురుకులాలన్నీ కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.12 వేల కోట్లతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే రెండు విడతల్లో 54 నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గురుకులాల్లో ఆహార కల్తీ జరిగినప్పుడు తనిఖీ చేసి కారణాలు, బాధ్యులను గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసింది. పాఠశాల స్థాయిలో ఆహార భద్రతా కమిటీలను ఏర్పాటు చేసింది. డైట్, కాస్మొటిక్ ఛార్జీల పెంపు, ఇతర గురుకుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ విద్యార్థులతో సీఎం, మంత్రులు పంచుకోనున్నారు. ఇంకా ఎలాంటి అవసరాలున్నాయో నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకోనున్నారు.

Last Updated : Dec 14, 2024, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details