Telangana Government Discussion on Irrigation Issue: మేడిగడ్డ ఆనకట్టు కుంగుబాటు అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చే నివేదికపై శాసనసభ వేదికగా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరుపుతోంది. విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారం మేరకు మేడిగడ్డ వద్ద నష్టం భారీగానే ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రవాహాన్ని నియంత్రించేందుకు పియర్స్ వెనక భాగంలో చేసిన కాంక్రీటు నిర్మాణాలు కొట్టుకుపోయాయని నిర్ధారించారు. అన్నారం, సుందిళ్లలోనూ ఇదే తరహా లోపాలకు ఆస్కారం ఉందని సర్కార్కు సమాచారం అందినట్లు సమాచారం.
మేడిగడ్డ బ్యారేజీలో మరిన్ని సమస్యలు - విజిలెన్స్ అధ్యయనంలో గుర్తింపు
Medigadda Incident in Telangana: మేడిగడ్డ అంశంపై మధ్యంతర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంపై రానున్న బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ వేదికగానే చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు(Nagarjuna Sagar Project), కాంపోనెంట్లను అప్పగించే ఆస్కారం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయమై స్పష్టమైన వైఖరితో ఉన్నామని, కేంద్రానికి ఇదే విషయాన్ని మరోమారు స్పష్టం చేస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాలపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.