Telangana Government Order to use Vijaya Ghee :రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇన్నేళ్లు ప్రభుత్వరంగ సంస్థ నుంచి కాకుండా ప్రైవేటు కొనుగోళ్లకే దేవాలయాలు ప్రాధాన్యమిస్తున్నట్లు గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టెండర్లతో పని లేకుండా ఇకపై దేవాలయాల్లో విజయ నెయ్యినే వినియోగించాలని తాజాగా ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ఉత్పత్తి చేసే నెయ్యిని పట్టించుకోకుండా ఆలయాల ప్రతినిధులు కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థల వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది.
తెలంగాణలో ప్రతి సంవత్సరం కోటి రూపాయలకు ఆదాయం వచ్చే ఆలయాలు 12 ఉండగా రూ. 50 లక్షల నుంచి రూ.కోటి ఆదాయం వస్తున్న దేవాలయాలు 24 ఉన్నాయి. రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం వచ్చే ఆలయాలు మరో 325 ఉన్నాయి. వీటిలో దాదాపు అన్నీ దేవాలయాల్లో లడ్డూ ప్రసాదం, నైవేద్యాలకు ప్రైవేటు సంస్థల నుంచే నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. పెద్ద ఆలయాల్లో దీనికి కోసం టెండర్లు పిలుస్తుండగా చిన్నవాటిలో అధికారులు నేరుగా సంస్థల నుంచే కొంటున్నట్లు తేలింది. ప్రభుత్వరంగంలోని సంస్థ అయిన విజయ డెయిరీ నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తున్నా ఆలయాలు మాత్రం ఈ సంస్థను పట్టించుకోకుండా ప్రైవేటు కంపెనీలకు ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో విజయ డెయిరీకి సంబంధించిన నెయ్యి కొనుగోళ్లు ఈ ఏడాది ఆరంభం నుంచి మందగించాయి.
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో : గతంలో ముంబయి సంస్థలు కొనుగోలు చేసినా ప్రస్తుతం మానేయడంతో 50 టన్నులకు పైగా నెయ్యి డెయిరీ వద్ద పేరుకుపోయింది. ఈ నిల్వలు ఇలా ఎక్కువ రోజులుంటే నాణ్యత దెబ్బతింటుందని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో విజయ డెయిరీ ఎండీ లక్ష్మి తమ సంస్థ వద్ద నెయ్యిని కొనుగోలు చేయాలని మార్చి 15న, జూన్ 1న దేవాదాయశాఖకు, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు లేఖలు రాశారు. ప్రభుత్వరంగ సంస్థను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అయినా దీనిపై ఎలాంటి స్పందనా రాలేదు.