Chess Olympiads Winner Met CM Revanth Reddy: చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణపతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.25 లక్షల చొప్పున పోత్సాహకాలను ప్రకటించారు. భారతదేశం తరపున తొలిసారి స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని అభినందించిన సీఎం రూ.25 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు చదరంగ విజేతలను అభినందించారు.
Chess Olympiad 2024 :హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్ జరిగిన సంగతి తెలిసిందే. టైటిల్ కోసం 190కి పైగా దేశాలు పోటీ బరిలోకి దిగాయి. దేశ విదేశాల తరపున ప్రపంచ అగ్రశ్రేణి ప్లేయర్లు తలపడ్డారు. అయితే ఈ చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించాయి.
భారత్ గతంలో 2014, 2022 రెండు ఎడిషన్ చెస్ ఒలింపియాడ్‌లోనూ కాంస్యం నెగ్గింది. కరోనా కారణంగా 2020, 2021లో పోటీలను వర్చువల్‌గా నిర్వహించారు. 2020లో రష్యాతో కలిసి సంయుక్తంగా భారత్ స్వర్ణం గెలిచింది. ఇక 2021 పోటీల్లో భారత్ కాంస్యం సాధించింది. అయితే వర్చువల్‌గా జరిగిన టోర్నీల ఫలితాలను అధికారికంగా రికార్డుల్లో చేర్చలేదు. ఈసారి స్వర్ణం గెలవడం వల్ల భారత్‌కు అధికారికంగా ఇదే తొలి గోల్డ్ అయ్యింది.