తెలంగాణ

telangana

రూ.24 వేల 42 కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ - మరో 8 కి.మీ పొడిగింపు - Hyd Metro Phase Two Update

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 8:13 PM IST

Hyderabad Metro Phase 2 Length Increased : హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు రెండో దశ విస్తరణను రాష్ట్ర ప్రభుత్వం మరో 8 కిలోమీటర్లు పొడిగించింది. ప్రతిపాదిత 70 కిలోమీటర్లకు అదనంగా మరో 8 కిలోమీటర్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజా బడ్జెట్​లో అందుకు అవసరమైన నిధులను భారీగా కేటాయించడంతోపాటు అంచనా వ్యయాన్ని కూడా సవరించింది. ప్రభుత్వం సూచనల మేరకు రెండో దశ విస్తరణ డీపీఆర్​లను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ చేర్పులు మార్పులు చేస్తోంది.

BHATTI ON METRO PHASE TWO
Hyderabad Metro Phase 2 Length Increased (ETV Bharat)

Hyderabad Metro Phase 2 Expansion Increased :హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను తీర్చడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో అందుబాటులో ఉన్న మెట్రో రైలు ద్వారా ట్రాఫిక్ సమస్య కొంతలో కొంత మెరుగవగా రెండో దశ విస్తరణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెట్రో మొదటి దశలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రెండో దశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించింది. అంతేకాకుండా కొత్త మార్గంలో 70 కిలో మీటర్ల వరకు రెండో దశ విస్తరణ చేయాలని తొలుత నిర్ణయించారు.

నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో 78.4 కిలోమీటర్ల పొడవున 5 కారిడార్లలో మెట్రో రైలు విస్తరణ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. రెండోదశ ప్రతిపాదనల్లో మరో 8 కిలోమీటర్లు మెట్రోరైలును విస్తరిస్తున్నట్లు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది. 24 వేల 42 కోట్ల రూపాయలతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ఉంటుందని తెలిపింది. రాయదుర్గం నుంచి విప్రో కూడలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్​లోని యూఎస్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మార్గాన్ని తొలుత ప్రతిపాదించారు. దాన్ని కోకాపేటలోని నియోపోలీస్ వరకు విస్తరించాలని సర్కారు తాజాగా నిర్ణయించింది.

హైదరాబాద్ మెట్రోకు రూ.1100 కోట్లు :దీంతో ఇక్కడ 3 కిలో మీటర్లుకుపైగా దూరం పెరగడంతో కారిడార్ పొడవు 11.3 కిలోమీటర్లు అయ్యింది. అలాగే నాగోల్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, మైలార్ దేవ్​పల్లి కూడలి నుంచి జల్​పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు తొలుత 29 కిలోమీటర్లుగా ఎయిర్ పోర్టు మెట్రోని అంచనా వేశారు. అది కాస్తా ఇప్పుడు 33.1 కిలోమీటర్లకు పెరిగింది. మైలార్ దేవ్​పల్లి నుంచి అరాంఘర్, కొత్త హైకోర్టు వరకు 5 కిలోమీటర్లు పైగా మెట్రో మార్గం కూడా రెండో దశలో ప్రతిపాదించారు. అందులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఎల్బీనగర్-హయత్ నగర్, మియాపూర్ నుంచి పటాన్​చెరు, ఫలక్​నుమా నుంచి చంద్రాయణగుట్ట వరకు మెట్రో మార్గం యథాతథంగా కొనసాగనుంది.

నాగోల్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్టలో మెట్రో ఇంటర్ చేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాద్ మెట్రోకు బడ్జెట్​లో రూ.1100 కోట్లను ప్రతిపాదించారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్​తో పోలిస్తే ఈసారి బాగా పెరిగింది. అలాగే పాతబస్తీ మెట్రో రైలు పనులు మొదలుపెట్టేందుకు 500 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు మరో రూ. 500 కోట్లను బడ్జెట్​లో చూపించారు.

విమానాశ్రయం మెట్రో కారిడార్​కు రూ. 100 కోట్లను వేర్వేరు పద్దుల్లో ప్రతిపాదించారు. మొత్తం ప్రతిపాదిత రూ. 1100 కోట్ల బడ్జెట్​లో 500 కోట్లు రుణంగా, 600 కోట్ల రూపాయలు గ్రాంట్లుగా ఇవ్వనున్నట్లు బడ్జెట్ పద్దులో ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు రెండో దశ విస్తరణ 8 కిలో మీటర్లు పెరగడంతో మెట్రో రైలు సంస్థ సిద్ధం చేసిన డీపీఆర్​ల్లో మార్పులు చేర్పులు చేస్తోంది.

7కిలో మీటర్లు - 6 స్టేషన్లు - ఎల్బీ నగర్‌ టు హయత్‌నగర్ మెట్రోకు లైన్ క్లియర్ - lb nagar To hayathnagar Metro

ABOUT THE AUTHOR

...view details