Telangana Govt Exercise for Crop Loan Waiver Scheme 2024 :తెలంగాణలోని రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి విముక్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆగస్ట్ 15 లోపు కర్షకుల రుణాలన్నీ మాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు.
2 Lakh Rythu Runa Mafi in Telangana 2024 : రాష్ట్రంలోని రైతులదంరికీ రెండు లక్షలల్లోపు రుణాలను మాఫీ చేయాలంటే రూ.30,000ల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా. ఈ దిశగా బ్యాంకర్లతో వ్యవసాయ, ఆర్థికశాఖ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధులు సమకూర్చడం తెలంగాణ సర్కార్‌కు చాలా క్లిష్టమైన పని. రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక ఆలోచన.
రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ :రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రైతుల అప్పులను బదలాయించాలని భావిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు వివిధ రూపాల్లో ప్రతి నెలా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆ కార్పొరేషన్‌కు జమచేసి బ్యాంకులకు చెల్లింపులు చేయాలన్నది ప్రతిపాదన. అయితే ప్రస్తుత రిజర్వ్ బ్యాంకు నిబంధనలు అందుకు అంగీకరించకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనం కోసం ఖర్చు చేసి దానిపై ఆదాయం వచ్చే అవకాశం ఉంటేనే కార్పొరేషన్‌కు బ్యాంకులు పెద్దమొత్తం రుణం ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒకవేళ కార్పొరేషన్ల కింద తీసుకునే రుణాలను కూడా రుణపరిమితికి లోబడి తీసుకునే అప్పు కిందే కేంద్రం పరిగణిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సర్కార్ ఏం చేస్తుందన్నది చూడాలి.
ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం ఫోకస్ :కార్పొరేషన్ ద్వారా అవకాశం లేనట్లైతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అయినా సరే రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం వివిధ విధానాలను పరీశీలిస్తున్నట్లు తెలిసింది. అదనపు ఆదాయ వనరుల అన్వేషణపై రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దృష్టి సారించింది. లీకేజీలను అరికట్టడంతో పాటు వివిధ మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై కసరత్తు చేస్తోంది. ఆ దిశగా పలు చర్యలను కూడా తీసుకుంటోంది.