Akkamahadevi Caves in Srisailam : ప్రకృతి అందాలకు నెలవైన నల్లమల అడవుల్లో కృష్ణా నది ఒడ్డున ఉన్న అక్కమహాదేవి గుహ. ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటకుల గమ్యస్థానాల్లో ఒకటి. ఈ గుహను సందర్శించాలంటే ఇప్పటివరకు శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నుంచి 16 కిలోమీటర్ల దూరం కృష్ణా నదిలో పడవలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ఇకముందు తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట నుంచి రోడ్డు మార్గంలో ఈ గుహకు, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలకు వెళ్లిరావచ్చు. దీనికోసం అటవీ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల మేర ఆ రాష్ట్ర అటవీశాఖ రహదారిని నిర్మించింది. దోమలపెంట నుంచి సఫారీ ప్రారంభం కానుంది.
దట్టమైన నల్లమల అడవిలో పచ్చని అందాలు, వన్యప్రాణుల సందడి మధ్య ఐదు కిలోమీటర్లు జీపులో ప్రయాణం చేయాలి. ఆ తర్వాత ఓ అర కిలోమీటరు దూరం ట్రెక్కింగ్ చేస్తే సరి. నిలువెత్తు గిరుల మధ్యలో ఉండే అక్కమహాదేవి గుహ లోపలికి వెళ్లిరావచ్చు. తెలంగాణలో ప్రకృతి పర్యాటకాన్ని పెంచేందుకు అటవీశాఖ ఆక్టోపస్ వ్యూ పాయింట్, వజ్రాలమడుగు, అక్కమహాదేవి గుహ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తోంది. దీన్ని కొద్దిరోజుల్లోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరికి రూ.6500 నుంచి రూ.8000 :అక్కమహాదేవి గుహ పర్యాటకుల కోసం రూపొందించిన ప్యాకేజీలో- బస చేసేందుకు గది, అల్పాహారం, భోజనం, రెండుసార్లు సఫారీ ఉంటాయి. ‘ఇద్దరికి కలిపి రూ.6,500, రూ.7,500, రూ.8,000 ఇలా మూడు రకాల టారిఫ్‌లు అందుబాటులో ఉంటాయి. గది విస్తీర్ణం, రివర్ వ్యూను బట్టి ఈ ధరలు ఉంటాయి’ అని అటవీ అధికారి ఒకరు ఈనాడుకు వివరించారు. దోమలపెంటలో హిల్‌టాప్ పక్కన ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌ను అటవీశాఖ ఆధునికీకరించింది.