Second Grade Teachers Regularization in Telangana :ప్రభుత్వ ప్రాథమిక విద్యార్థులకు సంబంధించి ఆ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమో అంతమంది టీచర్లనే కేటాయించనుంది. అవసరానికి మించి ఉంటే వారిని బదిలీ చేయనుంది. ఒక పాఠశాలలో 10 మంది విద్యార్థులు దాటితే అక్కడ ఇద్దరు టీచర్లు రానున్నారు. 41 మంది విద్యార్థులు మించితే ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల సందర్భంగా పాఠశాల విద్యాశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
2015, 2021 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మార్గదర్శకాల ప్రకారం 19 మంది విద్యార్థులు దాటితేనే ఇద్దరు టీచర్లను నియమించాలి. అయితే ఇప్పుడు అలా కాకుండా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా 10 మంది పిల్లలకు మించి ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అలా కేటాయించకున్నా సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో చదువుల పరిస్థితి కొంత మెరుగవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంత మంది విద్యార్థులకు ఎంత మంది ఉపాధ్యాయులు : విద్యార్థుల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2015లో జీవో 17, 2021లో జీవో 25ను తీసుకొచ్చింది. ఆ జీవోల ప్రకారం 19 మంది పిల్లలకు ఒక టీచర్, 20-60 విద్యార్థులకు ఇద్దరు, 91-120కి నలుగురు ఉపాధ్యాయులు, 121-150కి ఐదుగురు, 151-200కి ఆరుగురు, 201-240కి ఏడుగురు, 241-280 మంది విద్యార్థులకు ఎనమిది మంది టీచర్లను కేటాయించారు. 361-400 మంది విద్యార్థులకు ఏకంగా 11 మంది ఉపాధ్యాయులు ఉంటారు. నిజానికి క్షేత్రస్థాయిలో ఇది జరగడం లేదు.