Cyber Security Director Shikha GoyalOn Cyber Crimes : దక్షిణ ఆసియా దేశాలు సైబర్ నేరాలకు హబ్‌లా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ఎటువంటి లింక్ క్లిక్ చేయవద్దని, ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సైబర్ నేరస్తులపై పోలీసుల నిఘా పెరగడంతో సైబర్ నేరగాళ్లు నగరాలు వదిలి గ్రామాల నుంచి ఆపరేట్ చేస్తున్నారని ఆమె తెలిపారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మొదటిసారి అంతర్ రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించిందని శిఖా గోయల్ వెల్లడించారు. రాజస్థాన్ ముఠా రాష్ట్రంలో భారీగా సైబర్ నేరాలకు పాల్పడిందని తెలిపారు. నిరుద్యోగులు, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. ఈ ఆపరేషన్‌లో వివిధ రూపాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ సైబర్ కేటుగాళ్ల కోసం 20 రోజుల పాటు నాలుగు బృందాలు గాలించి పట్టుకున్నారని తెలిపారు.
తెలంగాణలో 189 కేసుల్లో రూ.9కోట్లు కాజేసిన రాజస్థాన్ ముఠా : నిందితులు తెలంగాణ రాష్ట్రంలో 189, దేశవ్యాప్తంగా 2,223 కేసుల్లో నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నమోదైన 189 కేసుల్లో రూ.9 కోట్లు కాజేశారని తెలిపారు. నిందితులు 29 ఫేక్ అకౌంట్లు తెరిచి, వాటి ద్వారా రూ.11.01 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడ్డారని శిఖా గోయల్ చెప్పారు. అదేవిధంగా నిందితుల నుంచి 31 చరవాణిలు, 37 సిమ్ కార్డులు, 13 ఏటీఎమ్ కార్డులు, 7 చెక్‌బుక్స్, రెండు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని ఆమె వివరించారు.